పురూరవ చక్రవర్తి మణిని గ్రద్ద తన్నుకు పోయిన సమాచారం విని కంచుకిని పిలిపించి మణిని తీసుకువచ్చే ఏర్పాటు చేయమని ఆఙ్ఞాపించాడు. వెంటనే కంచుకి నగరానికి వెళ్ళి తలారిని పిలిచి రాజాఙ్ఞ తెలియచేసాడు. అంతట తలారి నాలుగు దిక్కులకు మనుషులను పంపి గ్రద్ద కోసం వెతికించాడు. చ్యవనముని ఆశ్రమం వైపు వెళ్ళిన వాడు చచ్చి పడి ఉన్న గ్రద్ద నోట ఉన్న మణిని, దేహానికి ఉన్న బాణాన్ని తీసుకువచ్చి పురూరవుడికి అందచేసాడు.
పురూరవుడు ఆ బాణాన్ని పరిశీలించాడు. దానిమీద చెక్కిఉన్న అక్షరాలను చదివాడు. ‘పురూరవ చక్రవర్తికి ఊర్వశి యందు పుట్టిన కుమారుడు ఆయువనే వాని బాణమిది. ఈ శరం శతృవుల ప్రాణాలను అపహరించి తీరుతుంది’ అని ఉంది. ఆశ్చర్యచకితుడైనాడు పురూరవుడు.
ఇక్కడ ఇలా ఉండగా అక్కడ చ్యవన మహర్షికి ఆయువు బాణంతో గ్రద్దని కొట్టాడన్న సంగతి తెలిసి, వెంటనే సత్యవతిని పిలచి ‘ఋషి ఆశ్రమంలో ఇలాంటి హింసాకాండ తగని పని. ఈ రాకుమారుడు ఆశ్రమ విరుద్దమైన పనులు చేయడం మొదలు పెట్టాడు. ఇక ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. వెంటనే వీడిని తల్లితండ్రులకు అప్పగించు’ అని ఆఙ్ఞాపించాడు. ఆయువును వెంటపెట్టుకుని సత్యవతి ప్రతిష్ఠానపురానికి వెళ్ళింది. పురూరవిదు ఆమెను ఆహ్వానించి సకల మర్యాదలు చేసి, భక్తితో పూజించాడు. సత్య్వతి సంగతులన్నీ వివరంగా తెలియజేసి ఊర్వశీ, పురూరవులకు బాలుని అప్పగించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయింది.
అంతట పురూరవుడు అమితానందంతో బాలుని కైగలించుకుని ముద్దాడాడు. ‘దేవేద్రునికి జయంతుడు పుట్టినట్లు నాకీ కుమారుడు కలిగాడు’ అని అన్నాడు. దేవేంద్రుడి పేరు వినగానే ఊర్వశికి పూర్వ స్మృతి కలిగింది. వెనుకటి విషయాలన్నీ ఒక్కసారిగా ఆమె మనో వీధిలో మెరిశాయి. ఇక ఈ రాజును విడిచి వెళ్ళవలసి ఉందే అని కన్నీరు కార్చసాగింది. పురూరవుడు ఏమి కారణమని అడిగాడు. ఊర్వశి లోగడ జరిగిన వృత్తాంతమంతా రాజుకు తెలియపరిచింది.
అంతా విన్న పురూరవుడు బరువుగా విశ్వసించాడు. పుత్రుడికి రాజ్యభారం అప్పగించి అరణ్యాలకి పోవాలని సంకల్పించు కున్నాడు. ఈ సంగతి దేవేంద్రుడికి తెలిసింది. పురూరవుడు తపొవనాలకు పోతే దేవతలకు తీరని నష్టం కలుగుతుంది. అందువలన ఇంద్రుడు నారదుడిని ప్రార్ధించాడు. భూలోకానికి వెళ్ళి ఏవిధంగానైనా పురూరవుని ప్రయత్నాన్ని మాన్పించవలసిందిగా ఆ మహర్షిని అర్ధించాడు.
నారదుడు ప్రతిష్ఠానపురం వెళ్ళాడు. పురూరవుడు నారద మహర్షిని సకలవిధ గౌరవ మర్యాదలతో, భక్తి ప్రపత్తులతో పూజించి, సతీసమేతంగా సాష్టాంగ నమస్కారం ఆచరించాడు. అప్పుడు నారదుడు ‘మీరిద్దరూ ఎడబాయకుండా ఉండుగాక’ అని ఆశీర్వదించాడు. అందుకు వారు సంతోషించారు.
‘మహారాజా! నీవి అడవికి వెళుతున్నాట్టు దేవేంద్రుడు విన్నాడు. ఆయనకు తరచుగా నీ సహాయం అవసరం అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా నన్ను చెప్పమని నీ వద్దకు పంపాడు. నీ ఇష్టప్రకారం నీవు ఎల్లప్పుడూ ఊర్వశితో కలసి సుఖించవచ్చునని కూడా చెప్పమన్నాడు. కనుక నీవు ఇక ఆ తపోవనాలకు వెళ్లవలసిన పని లేదు’ అన్నాడు నారదమునీంద్రుడు.
‘మునీంద్రా! నేను దేవేంద్రుని ఆఙ్ఞకు బద్ధుడను. ఆయన చెప్పినట్లు నడుచుకోడానికి సిద్ధంగా ఉన్నాను’ అని నారదుడికి తెలియచేసాడు. మహర్షి ఈ విషయం ఇంద్రుడికి తెలియ పరిచాడు. ఇంద్రుడు సంతోషించాడు. పురూరవుడి కుమారుని పట్టాభిషేకానికి అవసరమైన పనులన్నీ చేయవలసిందిగా చెప్పి రంభ, మేనక, తిలోత్తమాది అప్సరసాంగనలను, ఇంకా అనేక అమూల్యమైన కానుకలను భూలోకానికి పంపాడు.
పురూరవుడికి, ఊర్వశికి జన్మించిన ఆయువు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఆ రాజ్యంలో ప్రజలు సకల సౌఖ్యాలూ అనుభవించారు.*
(సమాప్తం)