విక్రమోర్వశీయం!

Posted on

పురూరవుడు, ఊర్వశి కలసి చాలాకాలం సుఖించారు. అంతఃపుర భవనాలలో, ఉద్యావనాలలో యధేచ్చగా సంచరిస్తూ తనివితీరా రతిక్రీడల తేలియాడారు. ఒకనాడు తనకు అడవులలోనూ, కొండప్రాంతాలలోనూ విహరించాలని ఉన్నట్లు ఊర్వశి పురూరవుడికి తెలియచేసింది. ప్రియురాలి వేడుక తీర్చదలచాడు చక్రవర్తి. రాజ్యపరిపాలనా వ్యవహారాలన్నీ మంత్రులకు అప్పగించాడు. ఊర్వశిని వెంటపెట్టుకుని అరణ్యాలకి బయలు దేరాడు. అలా వారిద్దరూ కైలాస పర్వత ప్రాంతాలలోని గంధమాదన పర్వతం మీద రమణీయ దృశ్యాలు తిలకిస్తూ యధేచ్చగా విహరించసాగారు.

అప్పటివరకు జరిగిన కాలం మంచికాలం. ఊర్వశి పురూరవునితో కూడి సకల సౌఖ్యాలను అనుభవించింది. అంతట ఆమెకు చెడు రోజులు ప్రాప్తించాయి. దురదృష్టం ముంచుకుని వచ్చింది. ఒకనాడు గంగానదీ తీరాన సైకత స్థలాలలో ఒక చక్కని విద్యాధర స్త్రీ విహరిస్తూ ఉండగా పురూరవుడు చూచాడు. అయితే అతని మనస్సులో దుర్బుద్ధి ఏమీలేదు. కాని ఊర్వశికి మత్సరం పుట్టింది. రాజుపై కోపగించుకుంది. పురూరవుడు ఎంతో బ్రతిమాలుకున్నాడు. అయినా ఊర్వశి వినలేదు. భరతుని శాపం వలన ఆమెకు దివ్యఙ్ఞానము నశించింది. వినాశకాలే విపరీతబుద్ధీ అన్నట్లు పురూరవునిపై అలిగి, అక్కడికి దగ్గరలో ఉన్న కుమార వనంలోనికి వెళ్ళింది.

అది ఒక దివ్య వనం. పూర్వం కుమారస్వామి తపస్సు చేసిన ప్రాంతం. తన తపోదీక్షకు ఎవరైనా భంగం కలిగిస్తారేమోనన్న తలంపుతో కుమారస్వామి ఒక కఠోర నియమం పెట్టాడు. ‘స్త్రీ ఎవరైనా ఆ వనలో ప్రవేసిస్తే ఒక తీగ అయిపోవుగాక!’ అని శపించాడు. దేవ, గంధర్వ, విధ్యాధరాది మగువలందరికీ ఈ శాపం సంగతి తెలుసు. అందువలన ఆ వనంలోకి ఎవరూ వెళ్ళరు. కుమారస్వామి తపస్సు చేయడం వలనే దానికి కుమారవనం అనే పేరు వచ్చింది.

అయితే ఇప్పుడు ఊర్వశి దివ్యఙ్ఞానం కోల్పోయి, మూఢురాలై కుమారవనంలో ప్రవేశించింది. వెంటనే ఆమె ఒక గురిగింజ తీగగా మారిపోయింది. ఊర్వశి ఎటువెళ్ళిందీ, ఏమైనదీ పురూరవుడికి తెలియదు. ఆమె ఎడబాటు భరించలేక ఎంతో విచారించాడు. పిచ్చెక్కినట్లయింది. ఏమీ తోచక వెర్రివాడిలా ఆ అరణ్యప్రాంతంలో తిరగ సాగాడు. అతనికి ఓ రత్నం కనపడింది. అప్పుడు ఆకాశవాణి ‘రాజా! ఈ రత్నం తీసుకో. దీని పేరు సంగమనీయం. అది గొప్ప మహిమ కలది. పార్వతీదేవి పాదాల లత్తుక నుండి పుట్టిన దివ్యరత్నం. ఇది దగ్గర ఉంటే అప్పటివరకూ కనిపించకుండా ఉన్న ఇష్టమైనవి ఏదైనా తక్షణం కనిపించి తీరుతుంది’ అని పలికింది. పురూరవుడు సంతోషించాడు. ఆ మణి తీసుకున్నాడు. ఎదురుగుండాఉన్న తీగను తాకాడు. వెంటనే ఆ తీగ ఊర్వశిగా మారిపోయింది. వాళ్ల ఆనందానికి అవధులు లేవు.

‘ప్రియ సఖుడా! మీరు ఎన్ని భాదలు పడ్డారో అవన్నీ నేను ఙ్ఞాన దృష్టితో చూస్తూనే ఉన్నాను. భరత మునీంద్రుని శాపం వల్ల ఆ ఙ్ఞానం నాకు నశించి ప్రవేశించకూడని ఈ వనంలోకి ప్రవేశించాను అంటూ జరిగినదంతా చెప్పింది. ప్రతిష్ఠాననగరం విడిచి చాలారోజులైంది. మనం నగరానికి వెళ్ళిపోదాం. రండి అని తన మహిమ చేత మేఘవాహనం సృష్టించింది. వారిద్దరూ దాని మీద ఎక్కి సురక్షితంగా ప్రతిష్ఠాననగరం చేరుకున్నారు.

ఊర్వశితో సర్వ సౌఖ్యాలూ అనుభవిస్తూ పురూరవచక్రవర్తి అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తున్నాడు. కొంతకాలానికి ఊర్వశి గర్భవతి అయింది. అప్పుడామేకు పూర్వం ఇంద్రుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. పురూరవుని వలన ఒక కుమారుని కని తిరిగి దేవలోకానికి రమ్మని ఆయన ఆఙ్ఞ. ఆ విషయం తలచుకుని ఆమె ఒక ఆలోచన చేసింది. రాజును విడిచిపోకుండా ఉండేటట్లు చూడాలనుకుంది.

ఊర్వశికి ఒక చక్కని కుమారుడు కలిగాడు. వెంటనే ఆమె ఆ విషయం రాజుకు తెలియకుండా కుమారుణ్ణి తీసుకుని చ్యవనముని ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆశ్రమంలో ఉన్న సత్యవతి అన్న తాపస స్త్రీకి తన బిడ్డను అప్పగించి మళ్ళీ ప్రతిష్ఠానపురానికి వచ్చింది.

తాపసాంగన అయిన సత్యవతి ఊర్వశి కుమారుణ్ణి తన కన్న కుమారుని వలె అత్యంత గారాబంతో పెంచి పెద్ద చేసింది. చ్యవన మహర్షి ఆ బాలుడికి జరిపించవలసిన సంస్కారాలన్నీ జరిపించి, సకల శాస్త్రాలూ నేర్పాడు. రాజులకు ఉచితమైన ధనుర్విద్య భోధించాడు. ఆ పిల్లవాడు సకల శస్త్రాస్త్ర ప్రయోగాలలో ఆరితేరాడు. ఋషికుమారులతో పాటు అక్కడే ఉంటున్నాడు.

ఒక పర్వదినాన పురూరవుడు ఊర్వశితో కలసి త్రివేణీ సంగమమైన ప్రయాగలో స్నానం చేసి, పూజాదికాలు నిర్వర్తించాడు. తరువాత అలంకార సమయంలో దాసి సంగమనీయమణిని ఒక బంగారు బుట్టలో పెట్టుకుని తెచ్చింది. అప్పుడు అకాశంలో పోతున్న గ్రద్ద ఒకటి ఆ మణిని మాంసముద్ద అని అనుకొని క్రిందకి వాలి దానిని నోట కరచుకుని పోయింది.

ఆ విధంగా ఆ గ్రద్ద చ్యవనముని ఆశ్రమము పైగా పోతున్నది. ఋషికుమారులలో ఉన్న ఊర్వశి కుమారుడు దానిని చూచాడు. వంటనే ధనుస్సును తీసుకుని ‘అర్ధనారాచం’ అనే బాణంతో దాన్ని గురి చూచి కొట్టాడు. తక్షణమే గ్రద్ద మణితో సహా నేల కూలింది.

167691cookie-checkవిక్రమోర్వశీయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *