అప్సరసలు వెళ్ళిన తరువాత పురూరవుడికి ఏమీ తోచలేదు. ఊర్వశి వియోగాన్ని అతడు భరించలేకున్నాడు. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ చాలాసేపు నిలుచుండి పోయాడు. మనసు పరిపరి విధాల పోతూ ఉంది. చివరకు తన రధాన్ని మరలించి ప్రతిష్ఠానపురం చేరాడు. ఊర్వశి సురక్షితంగా రావడం చూచి ఇంద్రుడు సంతోషించాడు. జరిగినదంతా విన్నాడు. రాజును ఎన్నోవిధాల ప్రస్తుతించాడు.
తన పట్టణం చేరుకున్నది మొదలు పురూరవుడికి నిద్రాహారాలు లేవు. ఎప్పుడూ ఊర్వశే కళ్లముందు కనిపిస్తుంది. విరహ వేదన భరించలక పోతున్నాడు. ఊర్వశి మీద చింతతో మంచం పట్టాడు. పరిపాలనా వ్యవహారాలేమీ పట్టించుకోవడం లేదు. చింతాక్రాంతుడై ఉన్నాడు. తనకు ఆంతరంగికుడు, వేడుక చెలికాడు (విదూషకుడు) అయిన మాణవకుడితో సంగతంతా చెప్పాడు.
పురూరవుని భార్య కాశీరజ పుత్రిక అయిన ఔశీనరి. వచ్చినది మొదలు తన భర్త అదోమాదిరిగా, దిగులుగా ఉండడం గమనించింది. కారణం ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు. తన ఆంతరంగిక దాసి అయిన నిపుణికను పిలచి రాజు సంగతి చెప్పింది. నీవు వెళ్ళి రాజుగారి పరిస్థితి ఎలాఉందో తెలుసుకురా అంది.
నిపుణిక చాలా తెలివైనది. నేర్పు చాకచక్యం కలది. ఇటువంటి పనులు సాధించడంలో ఘటికురాలు. మాణవకుడికి ఈ విషయం తెలిసి ఉంటుంది. ప్రభువులు తమ మన్సులో మాట అతనికి చెప్పకుండా ఉండరు. కనుక విధూషకుడి దగ్గరకు పోయి ఏ విధంగానైనా సరే విషయం రాబట్టాలని బయలు దేరింది.
నిపుణిక మాణవికుడి దగ్గరకు వెళ్ళి ముచ్చట్లు ప్రారంభించింది. గరిక మీద పడిన మంచు బిందువులా అతని నోట్లో మాట దాగదని ఆమెకు తెలుసు. కనుక ఏవేవో మాయ మాటలు చెప్పింది. మాణవకుడు కూడా రహస్యం దాచుకోలేక పొట్ట ఉబ్బినట్లు నానా అవస్థ పడుతున్నాడు. ఈమె అసాధ్యురాలు. నా మనసులో మాట లాగాలని ప్రయత్నిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అని లోలోపల అనుకున్నాడు.
‘రాణిగారు రాజుగారికి ఒక మాట చెప్పమన్నారు – నిజంగా నామీద ప్రేమ ఉంటే నేనిట్లా దుఃఖిస్తూఉండగా ఏమీ పట్టనట్లు ఊరుకోవడం న్యాయమా – అని అడిగి రమ్మన్నారు మహారాణి’ అని చెప్పింది నిపుణిక. ‘ఓహో! అట్లాగా! రాణిగారిపట్ల రాజుగారు ఏమైనా ప్రతికూలంగా ప్రవర్తించారా’ అని అడిగాడు మాణవకుడు. ‘అవును రాజుగారు ఎవతెను గురించి తపించిపోతున్నారో, ఆమె పేరు పెట్టి రాణిగారిని పిలిచారు’ అన్నది నిపుణిక తెలివిగా. రాజుగారే తన గుట్టు రట్టు చేసుకున్న తరువాత ఈ రహస్యం దాచడానికి నే అవస్థ పడడం దేనికనుకొని, ‘అయితే రాజుగారు రాణిగారిని ఊర్వశీ అని పిలిచారా? ఆ అప్సరసను చూచినప్పడినుండి మహారాజుకు వెర్రెతింది. మహారాణికి దుఃఖం కలగచేయడమేకాక, నన్ను కూడా అనేకవిధాల వేధించుకుని తింటున్నాడు’ అని ఉన్న సంగతి బయట పెట్టాడు.
నిపుణిక అతని దగ్గర శెలవు తీసుకుని వెళ్ళి, రాణి దగ్గరకు వచ్చి, జరిగినదంతా చెప్పింది. పురూరవుడు ఊర్వశిపై ప్రేమతో విరహవేదన పడుతున్నాడని మహారాణి తెలుసుకుంది. ‘ఇక నుంచి నీవు సంగతంతా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండు. ఎప్పటి విషయాలు అప్పుడు నాకు చెప్పు’ అని దాసిని ఆఙ్ఞాపించింది.
పురూరవుడికి ఊర్వశి పిచ్చి మరీ ఎక్కువయిపోయింది. ఒకనాడు మాణవకునితో ప్రమదా వనానికి వెళ్ళాడు. అది వసంత ఋతువు. వనం అంతా చెట్లు చిగిర్చి ఉన్నాయి. పూలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ప్రకృతియావత్తూ శోభాయమానంగా ఉంది. చల్లని దక్షిణపుగాలి మెల్లగా వీస్తున్నది. పురొరవుడికి విరహతాపం మరీ ఎక్కువైంది. తాళలేకున్నాడు.
ఇక అక్కడ ఊర్వశి పురూరవుడిని విడచి హేమకూట పర్వతంకుండి దేవలోకానికి వెళ్ళినది మొదలు ఆమె మనసు మనసులో లేదు. చివరకు తట్టుకోలేక తన ఆంతరంగిక చెలికత్తె చిత్రలేఖను వెంటపెట్టుకుని ప్రతిష్ఠాననగరానికి బయలుదేరింది. అప్రాజిత విద్యతో ప్రమదావనంలో దిగారు. దిగాలుపడిఉన్న చక్రవర్తిని చూచారు. తిరస్కరణీ విద్యతో అదృశ్యంగా ఆయన వద్దకు వెళ్ళి నిలుచున్నారు. పురూరవుడు తన మనోవేదనను విదూషకునితో వెళ్ళబోసుకున్నాడు. అదంతా ఊర్వశి, చిత్రలేఖ వింటూనే ఉన్నారు. ఊర్వశి తనలాగే పరితపించి పోతున్న పురూరవుడికి భూర్జపత్రం మీద తన గోళ్ళతో ప్రేమలేఖ వ్రాసింది. తన మదనవికారమంతా వెళ్ళగ్రక్కుతూ – ప్రియా! మీరు నన్ను గురుంచి ఏదేదో చెప్పారు. మీ విరహవేదన నాకు అర్ధమైంది. నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా! తొలిచూపులోనే నా మనసు మీకు అర్పణ చేసాను. ఇంతకాలం మీ ఆలింగన సౌఖ్యం పొందలేని దురదృష్టవంతురాలను. నా స్థితిని గురించి మీకు మాటలలో చెప్పలేను. అయినా వినండి – మహారాజా! ఆ మదనుడు నన్ను ఎన్నివిధాల వేధించాలో అన్నివిధాల వేధిస్తున్నాడు. వెన్నెల, పన్నీరు, పుష్ప పరిమళం, మలయ మారుతం – ఇవన్నీ నాకు భరించరాని తాపం కలిగిస్తునాయి. నా అవస్థ ఇంతకంటే ఏం చెప్పను? ఇట్లు, మీ రతిసౌఖ్యాన్ని కోరు ప్రియురాలు ఊర్వశి’ అని ప్రేమలేఖ వ్రాసి దాన్ని చక్రవర్తిముందు పడవేసింది.
ఆ లేఖ చదివిన పురూరవుని ఆనందానికి అవధులు లేవు. తన చేతివేళ్ళు చమరుతుంటే ‘ఇది నాకు ప్రాణప్రదమైనది.దీనిని నీవు భద్రంగా దాచి ఉంచు’ అని విదూషకుడికి ఇచ్చాడు. ఊర్వశి, చిత్రలేఖలు పురూరవుని ముందుకి వచ్చి ప్రణమిల్లారు. కొంత సేపు సరస సల్లాపాలాడుకున్నారు. వేడుకగా ఏవో కబుర్లు చెప్పుకున్నారు. అయితే ఇంతలో దేవదూత వచ్చి ‘చిత్రలేఖా! ఊర్వశీ! మీరిద్దరూ తక్షణమే బయలు దేరి స్వర్గలోకానికి రావాలి. భరత మునీంద్రుడు ఇదివరకు ఊర్వశికి నేర్పిన ఆట, ఇప్పుడు ఆడితే చూడాలని మునీంద్రుడు, ఇంద్రాది దిక్పాలకులు వేడుక పడుతున్నారు. వెంటనే రమ్మనమని అమరేంద్రుని ఆఙ్ఞ ‘ అని వారిని తొందర పెట్టాడు.
ఊర్వశి కన్నీరు కారుస్తూ పురూరవుని విడవలేక, విడవలేక చిత్రలేఖతో దేవదూత తెచ్చిన విమానంలో నాకలోకానికి వెళ్ళిపోయింది. పురూరవుడు నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఊర్వశి అందచందాలను చూస్తూ విదూషకుడు ఆమె లేఖను జారవిడిచాడు. అది గాలికి కొట్టుకుపోయి, లతామండపము సమీపాన గుబురుగా ఉన్న ఒక చెట్టు చాటున దాగి ఉన్న మహారాణి, నిపుణికల దగ్గర వచ్చి పడింది. మహారాణి దానిని చూచింది.
పురూరవుడు మాణవకుని ‘ఊర్వశి వ్రాసిన లేఖ ఇలా ఇవ్వు. దానిని చూస్తూ అయినా పొద్దుపుచ్చుతా ‘ అన్నాడు. దానికి ‘ఊర్వశితో పాటు ఉత్తరం కూడా పోయింది ‘ అని బదులిచ్చాడు. ప్రభువు కోపగించు కున్నాడు. ఇద్దరూ ఉత్తరం కోసం వనమంతా వెదకసాగారు. మహారాజు వ్యవహారమంతా కళ్ళారా చూస్తూనే ఉంది మహారాణి. ఇక ఆమెకు కోపం ఆగలేదు. వెంటనే ఆమె మహారాజు దగ్గరకి వచ్చి ‘ఊరకనే ఎందుకు అలా విచార పడుతున్నారు? ఊర్వశి వ్రాసిన లేఖకోసం అలా అల్లల్లాడిపోతునారే? ఇదిగో ఆ లేఖ తీసికోండి ‘ అని భర్త చేతికి అందివ్వబోయింది. హఠాత్తు పరిణామానికి పురూరవడు నివ్వెరపోయి, నిశ్చేష్టుడై, నిబ్బరపడ్డాడు.
మహారాణి భర్తతో నిష్ఠూరాలాడి నిపుణికతో చరచర అక్కడినుండి వెళ్ళిపోయింది. అది చూచి పురూరవుడు సహించలేక ఆమె వెంటవెళ్ళి ఆమె దారికి అడ్డంగా నిలుచున్నాడు. ఎన్నో విధాల బ్రతిమాలుకున్నాడు. అయినా మహారాణి మనసు చల్లబడలేదు. ఆమె రాజు మాటలు వినిపించుకోకుండా అక్కడ నుంచి గబగబ తన మందిరానికి వెళ్ళిపోయింది. పురూరవుడి పని కుడితిలో పడ్డ ఎలక అయ్యింది.
అంతఃపురం చేరుకున్న రాణికి మనశ్శాంతి చిక్కలేదు. మహారాజుని అవమానించి కష్టపెట్టాను కదాని లోలోపల బాధపడ సాగింది. పశ్చాత్తాప పడుతూ లోలోపల కుమిలి పోయింది. చివరకు ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది. ‘ప్రియానుప్రసాదం’ అనే నోము పట్టాలని అనుకున్నది. ప్రియుడు కోపించి ఉన్నప్పుడు ఆయన కోపం పోగొట్టి వశపరచుకునే వ్రతం అది.
ఇక్కడ ఇలా ఉండగా అక్కడ దేవలోకంలో దేవ సభలో నాత్యమాడడానికి సర్వ సన్నద్దురాలై ఉన్నది ఊర్వశి. సరస్వతీదేవి రచించిన లక్ష్మీ స్వయంవరం అనే నాటకం అది. దానిని నాట్యాచారుడైన భరతుడు ఊర్వశికి నేర్పాడు. అత్యంత రమణీయమైన నాటకం అది. ఊర్వశి అన్యమనస్కురాలై పురుషోత్తమా అనడానికి బదులు పురూరవా అంది. దాంతో నాటకం రసాభాస అయింది. భరత మునీంద్రునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ‘నీవు క్షమించరాని తప్పు చేసావు. కనుక నీకు దివ్యఙ్ఞానం నశించుగాక! నీకు దేవలోక వాసం లేకుండపోవు గాక!’ అని కఠోరంగా శపించాడు.
భరతముని శాపవాక్యాలు విని ఊర్వశి దుఃఖంతో తపించిపోయింది. ఊర్వశిని చూచి దేవేంద్రుడు ‘సరే జరిగిందేదో జరిగింది. పురూరవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేసాడు. నీవు దిగులు పడకు. ఈ శాపం నీకు మేలే అవుతుంది. నీవు భూలోకం వెళ్ళు. పురూరవునితో కూడి కొంతకాలం సుఖించు. ఆయన వల్ల నీకొక కుమారుడు కలుగుతాడు. ఆ తరువాత అమరలోకం చేరుకుంటావు’ అని అనుగ్రహించాడు.
ఊర్వశి లోలోపల సంతోషించింది. భరతముని శాపంతో తనకు పురూరవుని పొందు ప్రాప్తిస్తుందికదా అనుకున్నది. తన చెలి అయిన చిత్రలేఖతో కలసి దేవలోకం నుంచి బయలుదేరింది. ప్రతిష్ఠాననగరానికి వచ్చి పురూరవుని కలసుకున్నారు. చిత్రలేఖ ‘మహారాజా! మీరు నిశ్చింతగా ఈమేతో కలసి సుఖించండి. ఎప్పటికీ దేవలోకం గురించి తలచుకోకుండా ఉండేటట్లు మా ఊర్వశిని సుఖపెట్టండి. తమరు శెలవు ఇప్పిస్తే వెళతాను’ అని పురూరవునికి ఊర్వశిని అప్పగించి వెళ్ళిపోయింది. ఊర్వశిని తీసుకుని పురూరవుడు అంతఃపురానికి వెళ్ళాడు. తన స్నేహితుని కోర్కె ఎట్టకేలకు నెరవేరినందుకు మాణవకుడు కూడా చాలా సంతోషించి అక్కడినుండి వెడలిపోయాడు.
తెలుగుసెక్స్కథలు డాట్ కం ఉత్తమ కథలను చదవండి !
****************