జానకిరాముడు

Posted on

అదేం సినిమానో గుర్తులేదు కానీ నాకు భలే నచ్చింది. నిజానికి, అప్పట్లో నేను చూసేదే నెలకో సినిమా కాబట్టి దాదాపు చూసినవన్నీ నచ్చేవి. అలాగే ఇదీ నచ్చిందనుకుంటా. ఇంటర్వెల్ లో మామయ్య నాకు కూల్ డ్రింక్, పాప్ కార్న్ కొనిపెట్టాడు. అవి తింటూ సెకండాఫ్ చూడ్డం మొదలెట్టాను.

సెకండాఫ్ మొదలయ్యాక ఐదు నిమిషాలకి మామయ్య బయటికెళ్లి సిగరెట్ తాగొస్తా అని చెప్పి వెళ్లాడు. అలా వెళ్లిన వాడు చాలాసేపటిదాకా రాలేదు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలో అంతగా లీనమైపోయాను మరి. క్లైమాక్స్ ఫైట్ వస్తున్నప్పుడు తిరిగొచ్చాడు. ఆయనొచ్చేసిన రెండు మూడు నిమిషాలకే సినిమా అయిపోయింది.
ఇంటికెళ్లాక మామయ్య డైరెక్ట్ గా పైకెళ్లిపోయాడు.

అర్ధ రాత్రి పన్నెండు కావస్తుందప్పుడు. అమ్మ ఏదో పుస్తకం చదువుతూ ఇంకా నాకోసమే ఎదురు చూస్తుంది. ‘ ఏరా నాన్నా. బాగుందా సినిమా? ‘ అంది నన్ను చూడగానే నవ్వుతూ. ఆ రాత్రి అమ్మ పక్కలో పడుకుని సినిమా కధంతా వివరంగా చెప్పా నేను. ఎప్పుడు నిద్రపోయానో కూడా గుర్తు లేదు.

తరువాతి రాత్రి కాస్త తొందరగా భోజనాలయిపోయాయి. ఎనిమిదే అయిందప్పుడు. భోజనం చేసి మామయ్య ఎక్కడికో బయటికెళ్లాడు. అమ్మ స్నానానికెళ్లింది. సాధారణంగా ఆమె రాత్రిపూట, అందునా డిన్నర్ తర్వాత స్నానం చెయ్యదు. ఆ రాత్రలా చెయ్యటం కాస్త కొత్తగా అనిపించినా నేను పెద్దగా పట్టించుకోలేదు. నా గదిలో కూర్చుని అంతకు ముందు రాత్రి సగంలో వదిలేసిన బొమ్మని పూర్తి చెయ్యటానికి ప్రయత్నిస్తుంటే అమ్మ స్నానం చేసొచ్చి నా పక్కన కూర్చుంది తల దువ్వుకుంటూ. కాసేపవీ ఇవీ మాట్లాడి ‘నిన్నటి సినిమా బాగా నచ్చిందన్నవుగా. మళ్లీ చూస్తావా?’ అంది.

ఆశ్చర్యపోయా నేను. ఆమె ఎప్పుడూ చూసిన సినిమా మళ్లీ చూస్తానంటే ఒప్పుకోదు, డబ్బులు దండగని. అలాంటిది నిన్ననే చూసిన సినిమాని మళ్లీ చూస్తావా అంటుంటే మొదట నేన్నమ్మలేకపోయినా, వెంటనే చూస్తానన్నట్లు తలూపాను ఆలస్యం చేస్తే ఆమె మనసు మార్చుకుంటుందేమోనన్నట్లు. ‘ఐతే సెకండ్ షోకి రెడీకా పో’ అంది వెంటనే. ‘నువ్వు కూడా రా మమ్మీ’ అన్నా నేను. ‘నాకింట్లో పన్లున్నాయిగానీ మామయ్య మళ్లీ వస్తాడేమో అడుగు’ అంటూ లేచి కిచెన్లోకెళ్లింది.

పది నిమిషాల్లో తయారై మామయ్య కోసం ఎదురు చూట్టం మొదలెట్టాను. తొమ్మిదిన్నరకి సెకండ్ షో మొదలవుతుంది. కనీసం పావుగంట ముందు బయల్దేరితేగానీ టైముకి అందుకోలేము. టైముకొస్తాడో లేదో అనుకుంటూ గాభరాగా ఎదురుచూస్తుంటే సుమారు తొమ్మిది గంటలప్పుడు బైక్ శబ్దం వినిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్లి మామయ్యని గుమ్మంలోనే ఆపి సినిమా సంగతి చెప్పాను. ‘నాకు రావటం కుదరదమ్మా. చాలా పనుంది’ అన్నాడాయన.

నా సంతోషమంతా ఆవిరయిపోయింది ఒక్క దెబ్బతో. నేనొక్కడినే సినిమాకెళ్లటానికి అమ్మ ఒప్పుకోదు. ఉసూరంటూ వెనక్కి తిరిగి ఇంట్లోకెళ్లా. అప్పుడే కిచెన్లోనుండొస్తూ నాకేసి చూసింది అమ్మ. ‘మరి నువ్వొక్కడివే వెళ్లగలవా భయం లేకుండా? నిన్ను జాగ్రత్తగా సినిమా హాల్ దగ్గర దింపి రమ్మని నే మామయ్యకి చెబుతా’ అంది విషయం విని. మళ్లీ సంతోషం వెల్లువెత్తింది నాలో.

సెకండ్ షో మొదలవటానికి పది నిమిషాల ముందే సినిమా హాల్ దగ్గర దింపి టికెట్ కొని పెట్టి లోపలకి పంపాడు మామయ్య. బైక్ స్టార్ట్ చేసి, ‘సినిమా పూర్తయ్యే టైముకి వచ్చి ఇక్కడే ఉంటా. నేరుగా ఇక్కడికే వచ్చై ఎటూ వెళ్లకుండా’ అని చెప్పి వెళ్లిపోయాడు. అదే మొదటి సారి నేనొక్కడినే సినిమాకెళ్లటం. అదీ సెకండ్ షోకి! నా స్నేహితులెవరూ అటువంటి అడ్వెంచర్ చెయ్యలేదా వయసులో. అది తలచుకుని గర్వంగా ఫీలవుతూ, నన్ను పంపుతూ అమ్మ చెప్పిన జాగ్రత్తలు గుర్తు చేసుకుంటూ లోపలికెళ్లాను. ‘ఇంటర్వెల్ లో ఏమన్నా కొనుక్కో’ అంటూ అమ్మ ప్రేమగా నా చొక్కా జేబులో పెట్టిన పది రూపాయల కాగితాన్ని తడిమి చూసుకుంటూ నా సీట్లో సర్దుకు కూర్చున్నాను. రేపీ సంగతి ఎలా నా స్నేహితుల దగ్గర చెప్పి పోజులు కొట్టాలో ఊహించుకుంటూ సినిమా చూడటంలో నిమగ్నమైపోయాను.

106506cookie-checkజానకిరాముడు

3 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *