నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 11

Posted on

ఏమైంది బెదరూ….?!” అజయ్ అడిగాడు. శంకర్ బదులివ్వలేదు. అతని చేతిలో వున్న ఫోన్ లోంచి, “—…అల్లుడుగారూ…. అల్లుడుగారూ…. హలో….హలో…—” అని మాటలు వినిపిస్తున్నాయి. దాన్నీ అతడు పట్టించుకోలేదు. తన ఆలోచనల్లో తాను మునిగిపోయాడు… ‘అంతకుముందు చాలాసార్లు శ్రీదేవి ఇలా అమ్మ తనని పిలుస్తోందని చెప్పి మూడు నాల్గు రోజులకు వెళ్ళి వచ్చేది. ఒకసారి ఫోన్ లో, “నువ్వు మాటిమాటికి ఫోన్ చెయ్యకు…. నేనే వీలు చూసుకొని ఫోన్ చేస్తాను..!” అని తను అనడం కూడా విన్నాడు. అడిగితే, “అమ్మ…. ఫోన్ చేసింది. నాకు ఫోన్ లో ఆఫర్ వుంది కదాని తనకు చేయవద్దని నేనే చేస్తానని తనకి చెప్పాను,” అని చెప్పింది. అప్పుడు తనకేమీ అనిపించలేదు… కానీ, ఇప్పుడదంతా ఆలోచిస్తుంటే బుర్రంతా పిచ్చెక్కిపోతోంది.’
అజయ్ శంకర్ భుజమ్మీద చెయ్యేసి ఊపుతూ, “బెదరూ…. ఏం జరిగింది…?” అన్నాడు మళ్ళీ. అంజలి కూడా లోపలికి వచ్చి శంకర్ వైపు ఆందోళనగా చూస్తోంది. అయితే, తలెత్తి వాళ్ళిద్దరి వైపూ చూడ్డానికి కూడా శంకర్ కి ఏదోలా వుంది. ‘శ్రీదేవి…. అహ్—’ తన మనసులో కూడా అలా అనుకోవటానికి అతనికి చాలా కష్టంగా వుంది.
మళ్ళా ఏదో గుర్తొచ్చి చేతిలో వున్న ఫోన్ వైపు చూశాడు. తన అత్తగారి కాల్ అప్పటికే కట్టయిపోయింది. రీసెంట్ హిస్టరీని ఓపెన్ చేసి మూడ్రోజుల క్రింద వచ్చిన కాల్స్ అన్నీ చూశాడు. ఒక నెంబరు దగ్గర అతడు ఆగిపోయాడు. దాని టైం చూసి మెల్లగా డయల్ బటన్ ప్రెస్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు.
‘మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుడు స్విచ్చాఫ్ చేసియున్నారు… దయచేసి—’ అని మెసేజీ వస్తూండటంతో విసురుగా ఫోన్ ని చెవి దగ్గర నుంచి తీసేసాడు. అతని ముఖంలోని కలవరం స్పష్టంగా కన్పిస్తుంది.
అంజలి నెమ్మదిగా శంకర్ దగ్గరకు వెళ్ళి అతని భుజమ్మీద చెయ్యేస్తూ, “ఎ-ఏమైంది శంకర్…?” అంది.
“నేను కూడా ఇందాకటినుంచి అదే తెలుసుకోవాలని దొబ్బించుకుంటున్నానిక్కడ….!” అంటూ తన అసహనాన్ని కాస్త గట్టిగా వ్యక్తం చేశాడు అజయ్. అంజలి అజయ్ ని ఆశ్చర్యంగా చూసింది.
శంకర్ ఓసారి తలెత్తి అజయ్ ని చూశాడు. అతని కళ్ళు ఎర్రబడి వుండటం అజయ్ కి కనపడింది.
“సారీ.. అజయ్… న్నేనేదో ఆలోచనల్లో వుండి—” అని శంకర్ అంటుండగా అతన్ని మధ్యలోనే ఆపేస్తూ, “అదంతా తర్వాత…. ముందు ఏం జరిగిందో చెప్పు..!” అన్నాడు అజయ్ అదే తీవ్ర స్వరంలో.
“శ్రీదేవి… తన తల్లి దగ్గరకు వెళ్తున్నానని నాతో అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆరోజున తనకు వచ్చిన ఫోన్ నెంబర్ ఇది… కచ్చితంగా తను ఇప్పుడు ఈ నెంబర్ గాడి దగ్గరే వుండుంటుంది. నేను ఈ నెంబర్ కి ఇప్పుడే ట్రై చేశాను. కానీ, స్విచ్చాఫ్ అని వస్తోంది…!” అంటూ ఆ ఫోన్ ని తన ప్రక్కనే మంచమ్మీద పడేశాడు.
అజయ్ శంకర్ భుజాన్ని అదిమి పట్టుకొని, “ఓహ్…. సారీ బ్రో…! విషయం తెలీక అనవసరంగా నీమీద ఆరిచేసాను. ఏది… ఆ ఫోన్ నెంబర్… నేను కనుక్కుంటాను… ఎవరిదో…!” అంటూ శంకర్ పక్కన వున్న ఫోన్ ని తీసుకున్నాడు.
“ఇంతకీ శ్రీదేవి ఎక్కడికి వెళ్ళుంటుంది?” అంది అంజలి శంకర్ తో.
“అదే నాకూ అర్ధం కావడంలేదు…!” అంటూ తలపట్టుకున్నాడు శంకర్.
అప్పుడే శ్రీదేవి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది శంకర్ ఫోన్ కి. శంకర్ ఫోన్ ఎత్తగానే,
“బాబూ…. నా పాపకి ఏమైంది…? నాకు చాలా కంగారుగా వుంది… నా పాప—” అని అంటుండగా శంకర్ కోపంతో వూగిపోతూ, “మీ ‘పాప’ మీ దగ్గరకు వెళ్తున్నానని నాకు అబద్దం చెప్పి వెళ్ళి ఇప్పటికి మూడ్రోజులైంది. తను నన్ను నమ్మించడానికి మీరని చెప్పి వేరే ఎవరితోనో మాట్లాడించింది కూడా…! అలాంటి మీ పాపకి ఏమయిందోనని మీకు కంగారుగా… బెంగగా వుందా…? తను ఎక్కడకు పోయిందో….? ‘ఎవడి’ దగ్గరకు….పోయిందో…? ఎందుకు పోయిందో…? తిరిగొచ్చే వుద్దేశ్యం వుందో లేదో…? అన్నీ పూర్తిగా కనుక్కొని మీకు మళ్లీ ఫోన్ చేసి చెప్తాన్లేండీ…! మీ ‘పాపని’ కట్టుకున్న పాపానికి నాకది తప్పదుగా….!” అని అరుస్తూ విసురుగా ఫోన్ ని కట్ చేశాడు.
సరిగ్గా ఆ సమయంలోనే సుజాత ఆ గదిలోకి అడుగుపెట్టి, “అమ్మా… సార్…. ఈ డ్రెస్ చూడండి…. బాత్రూంలో నానబెట్టి వుంది,” అంది.
శంకర్ ఆ డ్రెస్సును చూడగానే గుర్తుపట్టాడు. అది శ్రీదేవి అక్కణ్ణించి ప్రయాణమయ్యినప్పుడు వేసుకున్న డ్రెస్సు. అంతేకాదు, శ్రీదేవి కోసం తను ఎంతో ఇష్టపడి కొన్న డ్రస్సు అది.
ఆ రాత్రి ఊరునుంచి తిరిగొచ్చాక శ్రీదేవి ఆ డ్రస్సుని ఉతకడానికని బాత్రూమ్ కి తీసుకుపోయి అక్కడి బకెట్లో నానబెట్టి వుంచింది. అయితే, తను మళ్ళా ఆ బాత్రూంకి వెళ్ళలేదు (ఎందుకో మనందరికీ తెలుసు!). నిన్న రాత్రి దాన్ని ఎవరూ గమనించలేదుగానీ, ఇవ్వాళ సుజాత స్నానం చేస్తూండగా మరో బకెట్ లో తేలుతున్న ఈ బట్టల్ని చూసి కాస్త అనుమానం వచ్చి వాటిని తీసుకొచ్చి చూపించింది.
‘ఈ డ్రెస్ ఇక్కడ వుందంటే…. శ్రీదేవి తిరిగొచ్చిందా….? తిరిగొస్తే… మళ్ళా ఎక్కడికి పోయింది…?’ అనుకుంటూ అజయ్ తో అదే మాట అన్నాడు.
అదంతా వింటుంటే అజయ్ కి బుర్రంతా వేడెక్కిపోయింది. వెంటనే జేబులోంచి గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ప్యాకెట్ ని తీసి ఒక సిగరెట్ ని నోటికందించి లైటర్ తో వెలిగించాడు. మరో జేబులోంచి తన ఫోన్ ని తీసి తన స్టేషన్ కి కాల్ చేసాడు. “హా… పాణి…. ఓ నెంబర్ చెప్తా, నోట్ చేసుకో… అదెవరిదో తెలుసుకొని అడ్రస్సు కనుక్కో… వెంటనే నాకు చెప్పు….” అంటూ ఆ ఫోన్ నెంబర్ ని ఇచ్చాడు. తర్వాత ఫోన్ ని మళ్ళా జేబులో పెట్టేస్తూ శంకర్ తో, “అది నిజంగా శ్రీదేవిగారి డ్రెస్సేనా…?” అని అడిగాడు.
“అవును… అది శ్రీదేవిదే…!”
“ఆమెకున్న అన్ని డ్రెస్సులనూ నువ్వు ఇలాగే గుర్తుపట్టగలవా…?” అంటూ గుప్పుమని పొగను వదులుతూ అడిగాడు. అంజలి ఆ పొగని భరించలేక తన కళ్ళు చిట్లిస్తూ ముఖాన్ని త్రిప్పుకుంది.
“ఏఁ… ఎందుకు—?” అంటూ విసుగ్గా అడిగాడు శంకర్.
“రేయ్…అలా మొ…లా మొహం పెట్టకుండా నేను అడిగిందానికి తిన్నగా సమాధానం చెప్పు… తిరిగి నన్ను కొషనింగ్ చెయ్యకు….!” అన్నాడు అజయ్ మళ్ళీ తన గొంతును పెంచుతూ… తనిప్పుడు ఇన్వెష్టిగేటివ్ మూడ్ లోకి మారిపోయాడు. ‘ఇన్సపెక్టర్ టఫ్’ ఈజ్ ఆన్ డ్యూటీ…
అజయ్ అలా తమ ముందు బూతు మాట మాట్లాడేసరికి అంజలి, సుజాత లు అవాక్కయి చిరాగ్గా అతని వంక చూశారు. అయితే, ‘మిష్టర్ టఫ్’ అదేమీ పట్టించుకోకుండా శంకర్ నే తీక్షణంగా చూడసాగాడు.
దాంతో, శంకర్ కూడా కాస్త తడబడుతూ, “ల్లేదు… అన్నీ గుర్తు పట్టలేను. ఈ డ్రెస్…. నా ఫెవరెట్… నిజానికి, దీన్ని నేనే కొన్నాను…. త్-తనకోసం… అందుకే—” అంటుండగా
“నీకెవరిమీదైనా అనుమానం వుందా…?” అనడిగాడు అజయ్.

162200cookie-checkనాకెందుకు అబద్దం చెప్పారు? – Part 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *