“వచ్చి బట్టలేసుకోండీ… ఫోన్ వచ్చింది, వెళ్ళాలి,” అని గట్టిగా వాళ్ళతో అని అంజలికి డయిల్ చేశాడు.
“హలో…!”
“హా… అంజలీ మేడం! నేను శంకర్ ని మాట్లాడుతున్నాను.”
“తెలుసు… ఫోన్లో నీ పేరు కనబడుతుంది గానీ, ఎక్కడున్నావ్ నువ్వు? నీ కోసం వచ్చి చూశాను. నువ్వు కనబడలేదు,” అంది కూసింత కోపంగా…
“ఆ… నేను… కొంచెం బోరుకొడుతుందనీ ఇలా అడవిలోకి వచ్చానులే—”
“నాకు చెప్పుంటే నేనూ—”
“అదంతా తర్వాతగాని, అజయ్ ఫోన్ చేశాడు… మన క్లీనర్ కి పాము కాటేసిందని—”
“ఏ-ఏంటీ… పా…మా…?”
“ఆ… పామే… అక్కడున్న అమ్మాయిలకు ఆ విషయం చెప్పి వాళ్ళను ఎక్కడికీ పోవద్దని చెప్పు… నేను కూడా వస్తున్నాను… జాగ్రత్త!”
“మ్.. సరే… త్వరగా రా… నువ్వూ జాగ్రత్త!” అంటూ ఫోన్ కట్చేసింది అంజలి.
★★★
అజయ్ తర్వాత ఆ క్లీనర్ ని సుజాత సాయంతో నుంచోబెట్టి అతన్ని తన భుజమ్మీద వేసుకుని ముందుకి నడిచాడు. ఆ క్లీనర్ కాస్త ఎక్కువ బరువుగా వుండటంతో అజయ్ కి నడక కష్టమైంది. వెనకనే సుజాత రాసాగంది. కొంచెం దూరం వాళ్ళు వెళ్ళగానే బస్సు డ్రైవరు వారికి ఎదురొచ్చి, “సారూ… ఏమైంది మా పోరగాన్కి…?” అంటూ తను కూడా సాయం పట్టాడు. “పా-ము కా-టేసింది… అవునూ, నువ్విక్కడేం చేస్తున్నావ్?” అనడిగాడు అజయ్. “గా దుబ్బ మేడం(మీనాక్షి) మా కాడికొచ్చి యీడేదో అయ్యిందనీ ఎవరో అరిచారనీ సెప్పింది… నువ్ సూడనీకి వచ్చినావనీ కూడా సెప్పింది. అందుకే వచ్చినా…!” అన్నాడు. ‘హ్మ్… ఐతే, మీనా డార్లింగ్ సేఫ్ గా బస్ దగ్గరికి పోయిందన్నమాట’ అనుకుంటూ అజయ్ ఇంకా ఆ డ్రైవరు కల్సి ఆ క్లీనర్ ని మోసుకుంటూ రోడ్డు దగ్గరికి తీసుకెళ్ళారు. బస్సు ముందు ఇందాకటికన్నా ఎక్కువమంది అమ్మాయిలు గుమిగూడి వున్నారు. అంజలి, మీనాక్షి కూడా కాస్త ముందుకొచ్చి నిలబడి వున్నారు. అందరి మొహాల్లో ఒకరకమైన కలవరం తాండవిస్తోంది.
అక్కడ వాళ్ళ ప్రశ్నలకు సుజాత బదులివ్వగా వాళ్ళిద్దరూ క్లీనర్ ని జాగ్రత్తగా బస్సులోకి పట్టుకుని పోయి డ్రైవర్ సీటుకి వెనకున్న బల్ల పైన ఆ గాయపడ్డ కాలు క్రిందకు వాలినట్టు వుండేలా పడుకో బెట్టారు. డ్రైవర్ డెక్ దగ్గరి లైట్ ఆన్ చేశాడు. అందరూ బస్సెక్కి ఏదో వింతలా తొంగి చూడ్డంతో అజయ్, “ప్లీజ్… అందరినీ దూరంగా ఉండమని చెప్పండి… అతనికి గాలాడాలి,” అని అంజలికి చెప్పి తన సీటు దగ్గరకు పోయాడు. అంజలి అక్కడున్న అమ్మాయిలందరినీ మళ్ళీ బయటకు పంపేసింది. ఈలోగా అజయ్ తన బ్యాగ్ లోంచి ఒక చిన్న బాక్స్ ని ఒకదాన్ని తీసి దాన్ని ఓపెన్ చేసి అందులోంచి ఒక కాటన్ అలానే రెండు లిక్విడ్ బాటిల్స్ ఇంకా ఒక సిరెంజ్ ని తీసుకొని ఆ క్లీనర్ దగ్గరకు వచ్చాడు.
“ఏంటదీ, అజయ్ గారు?” అనడిగింది అంజలి.
“యాంటీ – వెనమ్ సెరమ్… ఇందాక ఆ పిల్ల(అంటూ సుజాత వైపు చూసి) చెప్పిన గుర్తుల ప్రకారం ఆ పామేంటో కొంచెం అర్ధమైంది. అందుకే, ఇనీషియల్ గా ఓ 10 వైల్స్ డోస్ ఇస్తే ఇప్పటికి కొంత ఉపయోగపడుతుంది… కానీ, సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్తేనే మేలు! 108కి కాల్ చేద్దాం… ఏంబులెన్స్ పంపమని…!” అంటూ అతనికి ఇంజక్షన్ ఇచ్చాడు.
“మీరు డాక్టరా…?” అనడిగింది సుజాత.
అజయ్ నవ్వుతూ, “ఊహు… పోలీస్ కానీ, ఎమర్జెన్సీ గ్రీవెన్స్ సెల్ లో ట్రెయినీగా వర్క్ చేస్తుంటాను. అంటే, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో అందరికీ తర్ఫీదు నిస్తానన్నమాట… మా వర్క్ లో భాగంగా చాలాసార్లు ఫారెస్ట్ క్యాంపింగ్స్ లో స్నేక్ బైట్స్ కి ట్రీట్ చేశాను… అలా… ఈ కిట్ ని ఎప్పుడూ నాతోనే ఉంచుకోడం అలవాటైపోయింది. అదే ఇప్పుడు మళ్ళీ ఇలా ఉపయోగపడింది,” అంటూ, “అవునూ.. నీ భుజానికేదో అయ్యినట్టుంది..? రక్తం కారుతోందీ…” అన్నాడు. అంజలి కూడా కంగారుగా, “ఏదీ… చూపియ్,” అంటూ ఆ గాయాన్ని చూసి, “ఏమైంది సుజీ…?” అని అడిగింది. “ఏం లేదక్కా… అదీ—” అంటూ సుజాత ఆ క్లీనర్ తనని ఎలా ఈడ్చుకుపోయింది వగైరా విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా వాళ్ళిద్దరికీ చెప్పింది. అజయ్ అదంతా విన్నాక, “సరే… ముందు బాగవనీ ఈ కొడుక్- సారీ… వీడ్ని… ఆ తర్వాత వీడ్నీ, ఆ డ్రయివర్ గాడ్నీ ఏం చెయ్యాలో నాకు తెలుసు..! అయినా, వాడు నిన్నింత బాధ కల్గించినా వాడికి సహాయం చేయాలనుకున్నావ్… గుడ్ ఆన్ యూ… బేబీ!” అన్నాడు. సుజాత చిన్నగా నవ్వింది. తర్వాత అజయ్ సుజాత గాయానికి కూడా మందేసాడు. ఇకపోతే అజయ్ మాటలకు జడిసిన ఆ బస్సు డ్రయివర్, “సారూ… గీ బద్మాష్ గానితో నాకేం సారూ… నేన్… వూకే…. ఒ-ఒ-ఒక్కసారి బస్సు కదులుద్దేమో జర ట్రై జేస్త… సారూ… ఒ-ఒక్కసారి…” అంటూ కంగారుగా డ్రైవింగ్ సీట్ లోకి పోయి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు.