‘అయిపోయింది… ఆఖరుది కూడా!’
కానీ… యేఁ ప్రయోజనం కనపడలేదు.
ఎపుడూ మనసుకు ఉపశమనాన్నిచ్చే సిగరెట్ కూడా ఎందుకనో ఈమారు విఫలమయ్యింది.
మళ్ళా మంచమ్మీద దబ్బుమని కూర్చున్నాడు. హేంగోవర్ కన్నా ఘోరంగా వుందీ పరిస్థితి.
ప్రక్కనే ఫేను గాలికి రెపరెపలాడుతూన్న ఓ పేపర్ పై అతని దృష్టి పడింది. అప్పటికి ఓ వందసార్లు చూసుంటాడు దాన్ని. అందులో వున్న ప్రతి అక్షరం అతని మనోఫలకంలో ముద్రపడిపోయింది.
మెల్లగా ఆ పేపరుని చేతిలోకి తీసుకుని మధ్యలోనున్న బొమ్మని చూస్తూ ప్రక్కనున్న పేరుపై వ్రేళ్ళతో తడిమాడు.
అదే క్షణంలో అప్రయత్నంగా అతని పెదాలు ఆ పేరుని పలికాయి.
“సౌ-మ్య!”
అమాయకంగా కన్పిస్తున్న ఆమె ముఖాన్ని చూసాడు.
లేడి పిల్లలా వున్న బెదురు చూపులు… మరుక్షణంలో ఆడ పులిలా మారి తనని ఉరిమి చూస్తున్న భావన కలిగింది అతనికి.
‘—పేరు సౌమ్యంగా వున్నా తన ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా వున్నట్లుంది కదా అజయ్!’ అని శిరీష్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మళ్ళా అతని గుండె వేగంగా కొట్టుకోనారంభించింది.
మెల్లగా గుండెమీద చెయ్యేసుకుని — “ఏం పిల్లరా బాబు!” అనుకున్నాడు.
(మొల క్రింద గుల పెంచే గుంటలే తప్ప ఈమెలా నిద్రపట్టనివ్వకుండా గుండెల్లో దడ పుట్టించిన యువతి అంతకుమునుపెప్పుడూ తారసపడలేదు మరి!)
ఆ తీక్షణమైన చూపులనుంచి తప్పించుకోడానికి అన్నట్టు కళ్ళను గట్టిగా మూసుకుని ఒక్కసారి అప్రయత్నంగా ‘గురు’ నామస్మరణ చేశాడు.
ఏకలవ్యుడి తపస్సుకి ద్రోణుడు చెవిలో విద్యలు వూదినట్టు ఒక్కసారిగా, “ఊహూ!! ఇలా కాదు, ముందు ప్రశాంతంగా నిన్ను నువ్వు శోధించు… అప్పుడు నీకు మార్గం దొరుకుతుంది!” అని శిరీష్ గ్రొంతు స్పష్టంగా తన చెవిలో ఉపదేశించినట్లు అన్పించింది అతనికి.
చటుక్కున తన కళ్ళని తెరిచాడు. సిగరెట్ పొగంతా మబ్బులా కళ్ళముందు కనపడి చిరాకుగా అన్పించటంతో చప్పున లేచి బయట లాన్ లోకి వచ్చాడు. అక్కడ వున్న ఓ చెక్క బల్లమీద కూర్చుని మళ్ళా ఆలోచించసాగాడు.
“మ్…నన్ను… నేను శోధించాలా… అదీ… ప్రశాంతంగా? హ్… ఎలాగబ్బా—?”
పచ్చని చెట్లనుంచి వీస్తున్న చల్లని పవనాలు అతని మెదడుని కాస్త చురుకుపరిచాయేమో… వెంటనే, “యస్… ఓసారి అలా చేసి చూస్తాను” అని అంటూ నెమ్మదిగా పద్మాసన ముద్రలోకి మారి గాఢంగా ఓసారి ఊపిరి తీసుకున్నాడు.
చల్లగా లోపలికి వెళ్తున్న గాలి తన గుండెని చక్కిలిగిలి పెట్టినట్టు అన్పించిందతనికి. మెల్లగా వెచ్చని శ్వాసని బయటకి వదిలాడు.
అలా తన శ్వాసమీద ధ్యాసను కేంద్రీకరించి దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ బయటకు వదలసాగాడు. అలా కొంతసేపు చేయగా మెదడు పొరల్లో ముసురుకున్న ఆలోచనలు మెల్లగా సద్దుమణిగి యద గమనం కూడ కాస్త తేలికపడింది.
అప్పుడే… ఎక్కడో దూరం నించి కిలకిలమని నవ్వు వినపడింది.
అతని భృకుటి ముడిపడింది.’ఎవరది?’ అనుకున్నాడు.
‘అన్నయ్యా…!’ అంటూ ఓ చిలిపి నవ్వు విన్పించింది.
‘వాణీ…!?’ అని అనుకున్నాడు మనసులోనే.
గుప్పున వాణీ రూపం అతని ముందుకొచ్చింది. ‘అన్నయ్యా…!’ అని నవ్వుతూ అతని ముందర గెంతుతోందామె.
ఏదో తెలీని ఉక్రోషం లోన పొంగుకొచ్చింది అజయ్ కి.
“ఏఁయ్!” అంటూ వెంటనే ఆమెను అందుకునేందుకు కదిలాడు.
‘దా… నన్ను పట్టుకో… అన్నయ్యా!’ అంటూ వాణీ నవ్వుతూ పరుగెడుతోంది.
అతను ఆమెను చేరువవుతూ—
“వాణీ! ఆగు…” అంటూ అరిచాడు.
అంతలో… మరోక స్త్రీ సమ్మోహిత దరహాసం ఓ పిల్ల తెమ్మెరలా అతన్ని తాకింది. తొలకరి జల్లులా ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేస్తోన్న ఆ నవ్వు ఎవరిదో తెలుసుకోవాలని మది తహతహలాడుతూండగా చప్పున తల త్రిప్పి అటువైపు చూశాడు.
‘సౌమ్య!’
ఆమె ముఖం అంతకుముందులా కోపంతో ఎర్రబడి లేదు! వికసించిన గులాబీలా ముగ్ధమనోహరంగా వుంది. ఆమె చూపులు తన గుండెల్లో బాకులు దింపేలా చురచురలాడటంలేదు… చిరుతడితో మిళితమై చమకులీనుతున్నాయి. సన్నగా వణుకుతోన్న పెదవులు ఆమె నవ్వుతూ వుండటం చేత చివర్న వంపు తిరిగి వున్నాయి. మొక్కజొన్న గింజల్లాంటి చక్కాని పలువరస మెరుస్తూ అగుపిస్తున్నది. ఆమె నవ్వుతోంటే కుడి బుగ్గపై పడ్డ సొట్ట మహ్…ఆ… సొగసుగా వుంది.!
ఆ నగుమోమును చూస్తుంటే అతనికి యదలో సంతోషం సుధలా పొంగుతోంది. అలా జీవితాంతం ఆమెను చూస్తూ ఎంతసేపైనా వుండిపోవాలనిపిస్తోంది. కాదు… ఆ నవ్వు మీదనే తన జీవితం మొత్తం ఆధారపడినట్లు అన్పిస్తోంది.
‘ఏంటిది?? ఎప్పుడూ లేని విధంగా నా గుండెంతా (మనసంతా) దూదిపింజలా గాల్లో తేలిపోతున్నట్టు చ్..చాలా…హ్-హాయిగా వుంది. గురూ చెప్పినట్లు ఇదేనా….. ప్-పరి-పూర్ణతంటే…!!! అంటే… సౌమ్యని… నేను—’
బీప్…
బీప్…