మీరు అర్ధం చేసుకున్నారా…? వీధిలో నలుగురూ చూస్తుండగా నన్ను కొట్టినప్పుడు, లాఠీని ఎక్కడబడితే అక్కడ తగిలించినప్పుడు నేను మీకు మనిషిలా కనిపించలేదా..? అదే… నా స్థానంలో ధనవంతుల బిడ్డలుంటే, వాళ్ళకీ మీరు ఇలాగే చేసేవారా…? మాలాంటి పేదవాళ్ళంటే మీకు చులకనభావం. ఏం చేసినా నోరు మెదపమని. అంతేగా! మేము పేదవాళ్ళం కావచ్చుగాని, పరువు తక్కువ వాళ్ళం కాము సార్!” అంటూ గద్గద హృదయంతో తీవ్రంగా ఆక్రోశించింది.
అజయ్ జరిగినదాని గురించి పశ్చాత్తాపపడుతున్నాడని సౌమ్యకు తెలుసు. అతను రెండుసార్లు క్షమాపణ చెప్పినప్పుడే ఆమె అది గ్రహించింది. అదే, అతను అంతకుముందు తనతో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అయ్యుంటే తను ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్నా అలా మౌనంగా ఉండేవాడు కాదు. సౌమ్య వాళ్ళ అమ్మ కుర్చీలోంచి లేచి తన కూతురి దగ్గరకి వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకుంది. బైటకి ప్రకటించకపోయినా ఆవిడ కూడా మనసులో ఇలాగే అనుకుంటోంది. కళ్ళలో నీరు పొంగుతుండగా ప్రేమగా సౌమ్య తలని నిమిరింది.
అజయ్ నిశ్చేష్టుడై సౌమ్యవంక చూడసాగాడు. ఆమె అన్న ఒక్కొక్క మాటా అతని గుండెల్లోకి సూటిగా చొచ్చుకుపోయింది.
సౌమ్య ఇంకా అజయ్ ని అలా చూస్తూనే, “మీకు మీ డ్యూటీ ముఖ్యం. మా బతుకులు ఏమైపోతే మీకేంటి, సార్! మేం చచ్చినా మీకేం నష్టం లేదు. దయచేసి మా యింటి నుంచి వెళ్ళిపోండి… గెటౌట్ ఆఫ్ మై హౌస్!” అంది కర్కశంగా.
అజయ్ నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. మాట్లాడటానికీ అతనికి ఏమీ పదాలు దొరకలేదు. చేతులు జోడిస్తూ వాళ్ళిద్దరికీ దణ్ణం పెట్టి బయటకు నడిచాడు.
సౌమ్య లోపలే వుండిపోగా వాళ్ళ అమ్మ అతని వెనకే బయటకు వచ్చింది. అజయ్ ఆవిడని చూసి, “వెళ్ళొస్తానండీ…!” అనేసి మళ్ళా ఓసారి నమస్కరించి జీపెక్కాడు.
సౌమ్య వాళ్ళ ఇంటినుంచి బయలుదేరిన అజయ్ మళ్ళా శిరీష్ ఇంటికి చేరుకున్నాడు. కానిస్టేబుల్ ని కాకినాడకి వెళ్ళిపొమ్మని చెప్పి వాడి దగ్గరనుంచి జీప్ కీస్ తీస్కొని ఇంట్లోకి అడుగుపెట్టాడు.
శిరీష్ అప్పటికే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఫ్రెషప్ అయ్యి హాల్లో కూర్చొని టీవీలో చానల్స్ తిరగేస్తున్నాడు.
అజయ్ రావడాన్ని గమనించి, “హా… టఫ్! రా రా…!” అంటూ లేచి నిలబడ్డాడు.
అజయ్ శిరీష్ ని చూసి ఓసారి తలూపి అతన్ని సమీపించాడు.
శిరీష్ కనుబొమలు ముడిపడ్డాయి. ఎప్పుడూ జోష్ గా పలకరించే అజయ్ ఇలా సైలెంట్ గా వుండటం అతన్ని విశ్మయపరిచింది. ఇద్దరూ కూర్చున్నాక భుజమ్మీద చెయ్యేసి, “ఏమైంది? అలా వున్నావేఁ?” అనడిగాడు.
“ఏమైంది…? బానేఁ వున్నానే,” అన్నాడు అజయ్ చిన్నగా నవ్వి మామూలు టోన్ లో.
శిరీష్ తల అడ్డంగా వూపుతూ, “అజయ్… నీ గురించి నీకన్నా బాగా తెలిసినవాడిని నేను. నీ మొహం చూస్తేనే అర్ధమవుతోంది, ఏదో అయిందని…!” అన్నాడు కన్సెర్న్ గా.
అజయ్ తల దించుకుని కూర్చున్నాడు. మెదడులో ఏవేవో అస్పష్టమైన ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి కదిలిపోతున్నాయి. ఒక్కటీ అర్ధం కావటం లేదు. అవును. ఏమైంది తనకు?
“అజయ్!” అంటూ శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి కదిపాడు. అజయ్ మెల్లగా తలెత్తి శిరీష్ మొహంలోకి చూశాడు.
అప్పుడే లత హాల్లోకి రావడం గమనించి ఆమెతో,
“మేడంగారూ… టీ చేసి పంపించండి మా యిద్దరికీ… మేం మేడ మీదుంటాం!” అని శిరీష్ లేచి నిల్చున్నాడు. లతని ‘మేడంగారూ…’ అని, ‘బంగారం…’ అని ముద్దుగా పిలుస్తూంటాడు శిరీష్.
అజయ్ కూడా సోఫాలోంచి లేచాడు. లత అజయ్ ని చూసి పలకరింపుగా నవ్వి వంటగది వైపు నడిచింది.
తర్వాత వాళ్ళిద్దరూ మేడెక్కారు. ఇంటిముందే కాక డాబామీద కూడా శిరీష్ రకరకాల పూల మొక్కలను కడియం నుంచి తెచ్చి పెంచుతున్నాడు. వాటి పరిమళాలు వాళ్ళని చల్లగా తాకుతున్నాయి. డాబామీద రెయిలింగ్ కి అల్లుకుని వున్న తీగమల్లెలు గాలికి అటు ఇటు ఊగుతూ ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాయి. నల్లని నింగికి తిలకం దిద్దినట్టుగా నెలవంక ప్రకాశిస్తున్నది.
పిట్టగోడ మీద కూర్చొని కాలుమీద కాలేసుకుంటూ, “హ్మ్… మీ చుట్టాలని ఎవరో ఇద్దరు ఆడవాళ్ళను తీసుకొచ్చావని ఇందాక వాణీ చెప్పింది. ఎవరు వాళ్ళు?” అడిగాడు శిరీష్.
అజయ్ మెల్లగా తన జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి గట్టిగా గుండెల నిండుగా ఒక దమ్ము పీల్చి వదిలాడు. తలపుల నీడ మెల్లగా కరిగిపోయినట్టుగా అనిపించిందతనికి.
శిరీష్ ప్రక్కనే తనూ కూర్చొని, “గురూ… వాళ్ళు నాకేమీ కారు. వాళ్ళని ఓ కేసు విషయమై విచారించాల్సి వచ్చింది. అందుకు ఈ ఇల్లు బాగా అనువుగా వుంటుందని అప్పటికి నాకనినిపించి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చాను…” అంటూ జరిగింది మొత్తం చెప్పడం మొదలెట్టాడు.
శిరీష్ అంతా శ్రద్ధగా వింటున్నాడు. అతనికి కొంత ఆశ్చర్యమేసింది. ఒకసారి బరిలోకి దిగితే ఎదుటివాడు ఎవ్వడయినా, ఎలాంటివాడయినా వెరవక మొండిగా దూసుకుపోయే మనస్తత్వం గలవాడు అజయ్. అందుకే అతన్ని ‘టఫ్’ అని పిలుస్తారంతా. అలాంటి వాడిని ఒక అమ్మాయి చిన్న చూపుతో చిత్తు చేయడం వినడానికి చాలా విడ్డూరంగా వుంది.
రెండు సిగరెట్లు… చెరో టీ అయిపోయాయి. అరగంట పైన సమయమూ గడిచిపోయింది. అజయ్ ఇంకా చెప్తూనే వున్నాడు…. నిజానికి, చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు.
“…..అవును… నేను… నా డ్యూటీ చేసాను… నిజంగా… నా తప్పేమీ లేదు. లేదు కదా…! కానీ, ఇదే మాటని అప్పుడు తను… సౌమ్య… అన్నప్పుడు మాత్రం— ఎందుకు గురూ… ఇక్కడంతా(అంటూ తన ఛాతీకి ఎడమవైపు చూపిస్తూ) ఎవరో పట్టుకుని గట్టిగా నొక్కేసినట్టయింది? సౌమ్య… నన్ను చూసిన ప్రతీసారీ… గుండెకాయ్… ఏదో రేసులో పరిగెత్తినట్టు… వేగంగా కొట్టుకునేది… ఏమీ అర్ధం కావటం లేదు. సౌమ్య— ”
శిరీష్ సన్నగా నవ్వుతూ, “ఒక అమ్మాయి పేరుని నువ్వు ఇన్నిసార్లు పలకటం… నేనెప్పుడూ చూడలేదు (వినలేదు అనాలేమో!) నిజంగా చాలా ఆశ్చర్యంగా వుంది అజయ్!! అయినా, ఎందుకో… సంతోషంగా కూడా వుంది!” అన్నాడు.
“అఁ—సంతోషంగా వుందా? ఎ-ఎందుకు?” విస్తుపోయాడు అజయ్.
శిరీష్ భుజాలరగరేస్తూ, “హ్మ్… ఎందుకూ అంటే… ఏమో! ‘ఇదీ’ అని ఇదిమిద్దంగా చెప్పలేనుగానీ, ఒకటి మాత్రం చెప్పగలను— మొదట ఇది కేవలం నీలో కలిగిన గిల్టీ ఫీలింగ్ వల్లనే అని అనుకున్నాను. అయితే, ఇప్పుడు మాత్రం ‘అంతకుమించి’ మరేదో వున్నట్టుగా తోస్తోంది…”
“ఆ ‘అంతకుమించి’ అంటే ఏంటో కొంచెం క్లారిటీగా చెప్పు గురూ… బుర్ర పిచ్చెక్కిపోతోందిక్కడ?” అన్నాడు అజయ్ అసహనంగా.
శిరీష్ అజయ్ ని చూసి, “ఎందుకో… నీ జీవితాన్ని పరిపూర్ణం చేసే శక్తి ఆ అమ్మాయికి వుందని నాకనిపిస్తోంది అజయ్…!” అన్నాడు.
అజయ్ నొసలు చిట్లిస్తూ, “గురూ… ఏం మాట్లాడుతున్నావ్…? ఆమె నా జీవితాన్ని—పరిపూర్ణం—చెయ్యడం—?” అంటూండగా ‘ఠంగ్’మని తలని ఎవరో బలంగా మోదినట్టుగా శిరీష్ మాటలలోని ఆంతర్యం అతనికి బోధపడింది. ఠక్కున లేచి నిలబడి, “అంటే— నేను తనని ‘లవ్’ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఐ థింక్ యువార్ మిస్టేకెన్ గురూ… అయాం టఫ్!! నాకీ ప్రేమా గీమా అనేవి….అస్సలు పడవ్. తెలుసుగా…!” అన్నాడు.
శిరీష్ కూడా లేచి, “మ్… తెలుసు తెలుసు… నేనూ చూస్తున్నానుగా! ఆ పేరుకి కూడా చరమగీతం పాడే సమయం ఆసన్నమైనట్టుగా అనిపిస్తోంది…” అని నవ్వుతూ అన్నాడు.
అజయ్ విసుగ్గా మొహం పెట్టి, “గురూ—” అంటూ ఏదో అనబోయాడు.