నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 13

Posted on

అజయ్ వెంటనే ఆమె మొహం దగ్గర మొహం పెట్టి కళ్ళలోకి చూస్తూ, “మరి నీ బాబుగాడేం సేత్తుంటాడేటి.? లారీల్లోకి సిలకల్ని సప్లయి చేత్తాడా?” అన్నాడు ఎగతాళిగా.
అంతే, ఆమె కళ్ళలో అంతవరకూ తిరుగుతున్న నీళ్ళ స్థానంలో ఒక్కసారిగా నిప్పులు చెలరేగినట్టయి ఒక్కసారిగా ఆమె ముఖం ఉగ్రంగా మారిపోయింది. అది చూసి అజయ్ కి ఒక్కసారిగా ఒళ్ళంతా గగుర్పాటుకు గురయింది. తడబడుతూ అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కేశాడు. ఇన్నేళ్ళలో అతనికి ఎన్నడూ ఇలా అనిపించలేదు.! ‘ఆ ఒక్క చూపుకి నా గుండేంటి ఇంత వేగంగా కొట్టుకుంటోందీ..?’ అనుకుంటూ గుండెలపై చెయ్యేసుకున్నాడు. గొంతార్చుకుపోయినట్లయింది. బలంగా గాలిపీల్చుకుంటూ కళ్ళను మూసుకొని తనేమన్నాడో మరలా ఓసారి గుర్తుచేసుకున్నాడు. ఆమె చేత ఎలాగైనా నిజం చెప్పించాలనే ప్రయత్నంలో తానెంత అమానుషంగా ప్రవర్తించాడో అజయ్ కి తెలిసొచ్చింది. ‘ఛ… ఒకరి తండ్రి గురించి అంత నీచంగా ఎలా వాగేశాను…?’ అనుకుంటూ ఓసారి ప్రక్కనున్న గోడని చరిచాడు.
తర్వాత సౌమ్యతో, “సారీ… నేను కావాలని అలా అనలేదు. ఏదో—” అంటుంగా ఆమె మధ్యలో కల్పించుకుని, “పర్లేదు సార్… నాకూ… మా అమ్మాకూ… ఇది అలవాటైపోయింది. నాన్న చనిపోయినప్పటినుంచీ…. ఎవడుబడితే వాడు…
షాప్ కొచ్చి… అమ్మతో… ఇలాగే… అసభ్యంగా ఏదో ఒకటి వాగుతుండేవారు. ఇరుగుపొరుగు వాళ్ళ… ఎత్తిపొడుపు మాటలు… రోడ్ల మీద ఆకతాయిల వెక్కిరింపులూ… రోజూ మాకు దినచర్యలో భాగమైపోయాయి… మగతోడు లేని మ్-మాలాంటి బ్రతుకులకు ఇదంతా మామూలే సార్…. మామూలే…!” అని ఉద్వేగంగా అనేసి వెక్కి వెక్కి ఏడ్చేసింది.
అజయ్ చేతిలోంచి లాఠీ జారిపోయి క్రిందపడిపోయింది. క్రిందకి వంగి దాన్ని తీసుకుని పైకి లేచి ఆమెతో, “సరే… ఇక పద… బయటకి— వెళ్దాం!” అన్నాడు.
సౌమ్య తన కన్నీళ్ళను తుడుచుకుంటూ అజయ్ వెంట ఆ గదిలోంచి బయటకు వచ్చింది. వాళ్ళమ్మ సోఫాలోంచి లేచి నిలబడింది. ఆమె కళ్ళలో కూడా నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. సౌమ్య తన తల్లి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆమె గుండెలపై తలపెట్టుకుని మళ్ళీ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.
అజయ్ నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వచ్చి, “ఆఁ…చూడండమ్మా… నా భాషా… నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టి వుంటే… క్షమించండి,” అంటూ చేతులు జోడించాడు. “కానీ, ఇదంతా నిజం చెప్పించడానికి చేసే ప్రయత్నమే… మామూలుగా అడిగితే నేరస్తులు ఎవరూ నిజం చెప్పరు… అందుకే, ఇలా…హ్— అంతేగానీ, మా మనసులో మరేమీ వుండదమ్మా…”
అజయ్ చెప్పింది విని ఆ పెద్దావిడ, “అయితే… మేము వెళ్ళిపోవచ్చా బాబూ?” అని మాత్రం అడిగింది.
దానికి అజయ్ బదులిచ్చేలోగా—
అప్పుడే ఆ యింటి వీధి తలుపు తెరుచుకొంది. వాణీ నవ్వుతూ లోనికి ప్రవేశించింది.

వాణీ లోపలికి అడుగుపెడుతూనే అజయ్ తో, “అన్నయ్యా…! వచ్చి ఎంతసేపయింది…? బయట జీప్ ని చూడఁగానే నువ్వొచ్చావని తెలిసిపోయిందిలేఁ—” అంటూ అతని ప్రక్కనే వున్న ఇద్దరాడాళ్ళనీ చూసి మాట్లాడ్డం ఆపేసింది. సౌమ్య కన్నీళ్ళతో ఉండటం తను గమనించింది.
“ఓయ్… వాగుడుకాయ్… ఎన్నిసార్లు చెప్పాను నీకు… నన్ను ‘అన్నయ్య’ అని పిలవొద్దని… ఆఁ… ఇంకోసారి పిలిచావంటేనా… నీ పిలకలు కత్తిరించేస్తాను!” అని వేలు చూపిస్తూ కోపంగా అన్నాడు అజయ్.
వాణీ తన స్కూల్ బ్యాగ్ ని క్రింద పడేసి అజయ్ ని చూసి వెక్కిరిస్తున్నట్టుగా తన నాలికని బయటకు చాపి, “అలాగా అన్నయ్యా… అలాగే అన్నయ్యా… ఇంకేంటి అన్నయ్యా….!” అంది నవ్వుతూ.
“ఏయ్…నిన్నూ.!” అంటూ అజయ్ వాణీని పట్టుకోవడానికి ఉరికాడు.
వాణీ కూడా కిలకిలా నవ్వుతూ, “పట్టుకో చూద్దాం…!” అని అతనికి దొరక్కుండా పరుగెత్తింది.
అదంతా చూస్తున్న సౌమ్యకి అప్రయత్నంగా నవ్వొచ్చింది. నవ్వుని బలవంతంగా ఆపుకోడానికి ప్రయత్నిస్తూ కన్నీళ్ళను తుడుచుకుని వాళ్ళని చూడసాగింది.
వాణీ అజయ్ నించి తప్పించుకోడానికి హాల్ చుట్టూ తిరుగుతూ సౌమ్య దగ్గరకు వచ్చి సడెన్ గా పరుగెత్తడం ఆపేసి, “అవునూ… అడగటం మర్చిపోయాను. వీళ్ళు ఎవరు అన్నయ్యా?” అంటూ అజయ్ ని అడిగింది.
అజయ్ కూడా ఆగిపోయాడు. ఏం చెప్పాలో ఠక్కున తోచక, “వాళ్ళూ… అ..మ్….వాళ్ళూ…నా—” అంటూ వుండగా, “మీ చుట్టాలా….?” అంది వాణీ.
చిన్నగా నవ్వి, “హా…. అలాగే అనుకో…!” అంటూ తలూపాడు అజయ్.
అప్పుడే, “మేమిక వెళ్ళిపోమా బాబూ…?” అంటూ అజయ్ ని మరలా అడిగింది ఆ పెద్దావిడ.
వాణీ వెంటనే అవిడ వంక చూస్తూ, “అరే… అలా ఎలా వెళ్ళిపోతారు.? రాక రాక వచ్చారు. కూర్చోండి, కాఫీ చేసిస్తాను. తాగుతూ అందరం చక్కగా కబుర్లు చెప్పుకుందాం…” అనేసి సౌమ్య చేతిని పట్టుకుని, “మీరు నాతో రండి!” అంటూ గుంజింది.
సౌమ్యకి వాణీని చూస్తే చాలా ముచ్చటేసింది. (సహజమేగా! ;)) తన చిలిపి పలుకులు వింటుంటే సౌమ్యకి మనసులో ఎంతో హాయిగా అనిపిస్తోంది. దాంతో, తన తల్లిని కూర్చోమని చెప్పి వాణీతో కలిసి తనూ వంటగది వైపు నడిచింది.
అప్పుడే శిరీష్ శ్రీమతి ఆశాలత కూడా ఇల్లు చేరింది. అజయ్ ఆమె దగ్గరకెళ్ళి, “గురుపత్నికి ప్రణామాలు,” అంటూ బాగా వొంగి ఆమెకు నమస్కరించాడు.
లత చప్పున ఒకడుగు వెనక్కి వేసి, “అజయ్ గారూ… మీకెన్నిసార్లు చెప్పాను. ఇలా చెయ్యవద్దనీ… నేను మీకన్నా చాలా చిన్నదాన్ని!” అంది నవ్వుతూ.
“అయితే ఏంటి? నువ్వు మా గురువుగారికి అర్ధాంగివి. అంటే… అతనిలో సగభాగం అన్నమాట. మరి అతనికి నేను ఎంత గౌరవం ఇస్తానో నీకూ అంతే ఇవ్వాలి కదా…!” అన్నాడు నవ్వుతూ. నవ్వులాటగా అన్నా, శిరీష్ జీవితంలో మళ్ళా సంతోషాన్ని నింపిన ఆశాలత అంటే అజయ్ కి నిజంగానే ఎంతో అభిమానం.
“చాలు చాలు… మీతో మాట్లాడ్డం చాలా కష్టం. అవునూ… వాణీ వచ్చిందా—?” అంటూ అక్కడ సౌమ్య వాళ్ళ అమ్మను చూసి ఆగిపోయింది.
“ఆవిడ— మా… దూరపు బంధువు… అన్నమాట!” అంటూ వెంటనే లత దగ్గరకొచ్చి ఆవిడని పరిచయం చేశాడు అజయ్.
లత ఆ పెద్దావిడకి నమస్కరించింది.
ఈలోగా వాణీ కాఫీని తయారు చేసి కప్పులలో పోసి ట్రేలో పట్టుకుని సౌమ్యతో పాటూ వంటగదిలోంచి బయటకు వచ్చింది.
లతకి సౌమ్యని పరిచయం చేసి అందరికీ కాఫీలు ఇస్తూ అజయ్ దగ్గరకి వచ్చి, “అన్నయ్యా… సౌమ్యగారు అచ్చం లతక్క లాగే చాలా అందంగా వున్నారు కదా…!” కాఫీ అందిస్తూ అన్నది.

162240cookie-checkనాకెందుకు అబద్దం చెప్పారు? – Part 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *