ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 3

Posted on

అతను వెనక్కి తిరిగి ఇంటి హై సీలింగ్, మధ్యగా అమర్చిన అందమైన పెద్ద శాండిలీర్ చూస్తూ తన వెనక వస్తుండటంతో కొంచెం నిరుత్సహ పడింది. తను అంత కష్టపడి డ్రెస్ సెలెక్ట్ చేస్తే మహానుభావుడు అస్సలు పట్టించుకున్నట్టు లేదు అని. పైకి చేరిన తరువాత ఎడమవైపు చూపించి అతనికి ముందు నడుస్తూ తన గదిలోకి తీసుకు వెళ్ళింది. గదిలోకి వెళ్లిన శ్రీరామ్ కి మతి పోయింది.

ప్రవేశించగానే కూర్చోవడానికి సిట్ అవుట్ ఏరియా, అక్కడ ఒక రిక్లైనర్, ఒక కుర్చీ, రెండు సీట్ల సోఫా, మధ్య కాఫీ టేబుల్ తో కలిసిన ఖరీదైన ఫర్నిచర్ ఉంది. సోఫా కి వెనక గోడకి ఒక పెద్ద టేబుల్ కన్సోల్, పైన మూడు గాజు అల్మైరా లతో కూడిన పెద్ద బుక్ షెల్ఫ్. కుడి వైపుకు వెళితే దాదాపు 22×26 అడుగుల విస్టీర్ణంలో ఉన్న గదిలో, ఒక వైపు గోడకానుకొని కింగ్ సైజు బెడ్డు, సైడ్ టేబుల్స్, ఇంకో వైపు పెద్ద వార్డ్ రోబ్, మరో వైపు ఒక చిన్న స్టడీ టేబుల్ చైర్, మంచానికి ఎదురు వేపు గోడపై మౌంట్ చేసిన 65 అంగుళాల టీవీ. ఇంకో పక్క గోడకి తలుపు వుంది. బహుశా బాత్ రూమ్ అయివుండచ్చు అనుకొన్నాడు. ముందుగానే లైట్స్ వేసి ఉంచడంతో దేదీప్య మానంగా వెలిగి పోతుంది బెడ్ రూమ్. తనకి గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండే కొంచెం రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాని అలాంటి బెడ్ రూమ్ అంతవరకూ చూడని శ్రీరామ్ తన ఆశ్యర్యాన్ని మనసులోనే దాచుకొన్నాడు.

తను ఒప్పుకుంటే అదే తమ బెడ్ రూమ్ అన్న తలంపు వచ్చి అతని పెదవులపై చిరు దరహాసం మెరిసినా, అది కనిపించనీయకుండా ఇంకో వైపు చూస్తూ “చాలా బాగుందండి మీ గది”, అని మెచ్చుకున్నాడు సిన్సియర్ గా. జవాబుగా “థాంక్స్”అని నవ్వి ఊరుకుంది కావ్య.

తను సంభాషణ మొదలు పెడతాడేమోనని ఎదురు చూస్తుంది. ఈ లోపల బుక్ షెల్ఫ్ వేపు నడిచిన శ్రీరామ్ ప్రతి పుస్తకాన్ని చూడసాగాడు. “ఓ మీరు sapiens a brief history of humankind చదివారా. వెరీ గుడ్ బుక్. when breath becomes air, వెరీ టచింగ్”అంటూ పైకి మాట్లాడుతూ పుస్తకాలను వరుసగా చూడసాగాడు. కింద సెక్షన్ లో తెలుగు పుస్తకాలు చూసి,”మీరు తెలుగు పుస్తకాలు కూడా చదువుతారా. భరాగో, చాసో కధలు, మీ కలెక్షన్ చాలా అద్భుతంగా ఉంది”, అంటూ ఉత్సాహంగా చెబుతుంటే అతను బుక్స్ బాగా చదువుతాడని అర్ధం అయ్యింది. మనస్సులో ఒక మెట్టు పైకి ఎక్కాడు.

ఇక అలా వదిలేస్తే పుణ్య కాలమంతా తినేస్తాడని “లేదండి. నేను ఎక్కువ ఇంగ్లీష్ చదువుతాను. తెలుగు పుస్తకాలు అమ్మ, నాన్న చదువుతారు. వాళ్ళ రూమ్ లో ఎక్కువయిపోతే ఇక్కడ పెట్టాము. రండి కూర్చోండి”అంటూ తను కూర్చుంది.
కొంచెం సేపు వరకు అతను ఏమి మాట్లాడకపోతే తనే కదిపింది,”మీరు బాడ్మింటన్ లో స్టేట్ రన్నర్ అప్ అని చెప్పారు అంకుల్”
“అవునండి నేషనల్స్ కి ఎంట్రీ వచ్చింది. ట్రైన్లో ఢిల్లీ వెళ్లి రావాలంటే నాలుగు రోజులు పడుతుంది. ఇంకో పక్క పరీక్షలు దగ్గర పడ్డాయి. ఫ్లైట్ లో వెళ్లి వచ్చే తాహతు లేదు. అంతా ఆలోచించి వెళ్లడం మానేసాను. ఒకందుకు అదే మంచిదయ్యిందేమో, చదువు మీద దృష్టి నిలుపాను.”అన్నాడు నిర్లిప్తంగా.
“ఐఐటీ లో గోల్డ్ మెడలిస్ట్ అని కూడా చెప్పారు”,అంది ఇంకో అస్త్రం వేస్తూ ఏమైనా ఓపెన్ అప్ అవుతాడేమోనని.
“అవునండి దేవుడి దయ వల్ల నాకు చదువు బాగానే వచ్చింది”అన్నాడు అణకువగా.
కొంచెం లిఫ్ట్ ఇచ్చినా తను ఎక్కువగా చెప్పకపోవడంతో, చూస్తుంటే ఈ రాముడు మరీ బుద్ధిమంతుడిలా ఉన్నాడు, కాకపొతే కొంచెం రిజెర్వేడ్ టైపు, ఇక తనే లీడ్ తీసుకోవాలి అని నిశ్చయానికి వొచ్చింది. ఏ మాత్రం అవకాశం వచ్చినా తమ గొప్పలు చెప్పుకునే అబ్బాయిలను చూసిన తరువాత, కనీసం తను వివాహానికి పరిశీలిస్తున్న అమ్మాయితో తన గురించి చాలా వున్నా, అవకాశమిచ్చినా చెప్పుకోకపోవడం ఆశ్చర్యమనిపించింది.

“ఇంతలో ఇక వెళదామా అండి”, అనటంతో షాక్ అయ్యింది.
అంతలోనే తేరుకొని,”అరె అప్పుడే, మీకు టిఫిన్ కూడా పెట్టలేదు”, అంటూ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గది బయటకు వచ్చి కొంచెం దూరంగా ఎదురు చూస్తున్న పనిమనిషి సీత దగ్గరికి వెళ్లి, పది నిమిషాలు తరువాత టిఫిన్ తీసుకురా. తరువాత ఇంకో పావుగంటకి కాఫీ పట్టుకురా అని మెల్లిగా చెప్పి లోపలికి వెళ్ళింది.

అసలు కొంచెం కూడా తినకుండా వెళ్ళిపోతే అమర్యాదగా ఉంటుందని కూర్చున్నాడు. చేతులు కడుక్కోవాలి అంటే తన రూమ్ లో మూసివున్న తలుపు కేసి చూపించింది. అది తీసుకొని లోపలికి వెళితే 8×10 సైజు లో ఒక డ్రెస్సింగ్ రూమ్. గదిలో పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్, బట్టలు పెట్టుకోవడానికి వార్డ్ రోబ్స్. ఒకటి తెరచి ఉండటంతో అందులో కావ్య ఖరీదైన డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. ఆ గదికి ఆవల వైపున ఉన్న తలుపు తీసుకొని లోపలికి వెళితే బాత్రూం. ఆల్మోస్ట్ తన థర్డ్ బెడ్ రూమ్ అంత పెద్దది. ఒక వైపున గ్లాస్ పార్టిషన్ తో షవర్ క్యూబికల్, దాని పక్కన పెద్ద బాత్ టబ్. గోడలకి అద్దాలు, మార్బల్ కౌంటర్ టాప్, కింద షెల్ఫ్ లు. గోడలకి అందమైన డిజైనర్ టైల్స్, ఆంటీ స్కిడ్ ఫ్లోర్ టైల్స్ తో చాలా అద్భుతంగా ఉంది. స్టార్ హోటల్ లో కూడా అంత అందమైన, విశాలమైన బాత్ రూమ్ చూడలేదు. చేతులు కడుక్కొని, అక్కడ టవల్ తో తుడుచుకొని వచ్చాడు.

తనే మాటలు కదిపింది. మాటల్లో అతను మెల్లిగా తమ కుటుంబం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, తన తల్లితండ్రులు కష్టపడి తనని చదివించి, చెల్లికి పెళ్లి చేయడం అన్ని చెప్పాడు. అతను తమ స్థితిగతుల గురించి చెబుతుంటే అతని నిజాయితీ నచ్చింది. ప్రతివారు ఎంతో కొంత ఎక్కువ చెబుతుంటే, ఇతనేమిటి కొంచెం భిన్నంగా ఉన్నాడు, అవకాశమిచ్చిన తనగురించి ఎక్కువ చెప్పుకోలేదు. ఏమై ఉంటుంది? ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా లేక అతను అణుకువ కలిగిన వ్యకిత్వమా అన్న అంచనాలు వేస్తోంది మనస్సులో.

ఇంతలో స్నాక్స్ వస్తే టేబుల్ మీద పెట్టించి అతనికి ఒక ప్లేట్ స్వయంగా అందించింది. తింటున్నప్పుడు ఏమి మాట్లాడలేదు. తన గురించి ఏమి అడగక పోవటం కావ్యకు ఆశ్చర్యం కలిగిస్తుంటే, అక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని శ్రీరామ్ ఆలోచిస్తున్నాడు.

కొంచెం సేపటికి కాఫీ లు వచ్చాయి. కాఫీ కప్పు అందిస్తూ, అది తాగితే ఇక తమకు సమయం లేదని తనే అడిగింది చివరికి,”ఇంతకీ మీరు నా గురించి ఏమి అడగలేదు”

గొంతుకలో ఉన్న కాఫీ గుటక వేసి ఒక్క క్షణం ఆగాడు. ఆమె అడిగిన దాన్ని బట్టి తనలా ఆమె డిసైడ్ అవలేదని ఊహించి, ఎలా చెప్పాలి అని కొంచెం ఆలోచించి, ఊపిరి తీసుకోని చెప్పసాగాడు.

“మీకు ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదండి. అసలు మీరు ఇంకా మా సంభందం గురించి ఇంకా ఆలోచిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు మాకు ఆర్ధికంగా చాలా తేడా ఉంది. నా అపార్ట్మెంట్ మీ బెడ్ రూమ్ సైజుకి రెండింతలు ఉంటుందేమో. కుర్రాడు బాగా చదువుకున్నాడు, కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేస్తే సరిపోతుంది అని మీ పేరెంట్స్ అనుకొని ఉండవచ్చు. నా ఆదాయంతో మీరు ఇప్పుడు పొందే సుఖాలను ఇచ్చే తాహతు నాకు లేదు. అలాగని ఆయాచితంగా వచ్చే డబ్బుని కూడా అనుభవించాలని ఉండదు. స్వంత కాళ్లపై నిలబడాలి అన్నదే నా ఆశయం. స్వశక్తితో ఒక్కో మెట్టు పైకెక్కాలన్నదే నా ఆలోచన. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. బాగా చదువుకున్న, ఆర్ధికంగా మా స్థాయిలో ఉన్న వారినే చూడమన్నాను. ఇంతవరకు అనుకోకుండా వచ్చింది. నేను చేసుకునే అమ్మాయి పెళ్లి తర్వాత కష్ట పడటం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మీకు వంక పెట్టటానికి ఏమి లేదు. మీకు అన్ని వున్నాయి. మీకు సరిపోయే మంచి గొప్ప సంభందం తప్పక దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్”

175742cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *