ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 3

Posted on

“వాడికి చాలా స్వతంత్ర భావాలున్నాయి. తన కాళ్ళ మీద నిలబడేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకొన్నాడు. ఆరు నెలల క్రితమే హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కున్నాడు. అడగ్గా అడగ్గా, చివరగా లాస్ట్ మంత్ పెళ్ళికి ఒప్పుకున్నాడు. వాడు అడిగింది ఒక్కటే. మెరిట్ తో బాగా చదువు కున్న అమ్మాయి కావాలన్నాడు. మా బంధువుల్లో అంత ఎక్కువ చదివిన వారు లేరు. కొంత మంది ఎదో పేరుకి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. మంచి కాలేజీలో మెరిట్ తో ఇంజనీరింగ్ చదివిన వారు అమెరికా సంభందాలు ఇష్ట పడుతున్నారు. మా వాడు మేరా భారత్ మహాన్ అంటాడు. ఇదిగో మీ సంభందం వచ్చింది. కావ్య బాగా చదువుకున్న అమ్మాయి. యూనివర్సిటీ బాడ్మింటన్ ప్లేయర్ అని చెప్పారు మధ్యవర్తి. అది నచ్చినట్టుంది వాడికి.”

ప్రసాద్ రావు చెప్పిన విషయాల్లో కొన్ని మధ్యవర్తి ద్వారా తెలిసిన విషయాలు అయినా చాలా కొత్త విషయాలు తెలిసే సరికి మరింత ఆనంద పడ్డారు అందరూ. కావ్యకి వాళ్ళిచ్చిన బయోడేటాలో శ్రీరామ్ బాడ్మింటన్ ప్లేయర్ అన్నట్టు లేదు. బహుశా తన గురించి ఎక్కువగా చెప్పుకోవటం ఇష్టం లేదేమో తనకి అనుకుంది. రాజారావుకి ముఖ్యముగా శ్రీరామ్ అకాడెమిక్స్, ఆలోచన సరళి బాగా నచ్చింది. కూతురుకి కూడా ఆ భావాలు నచ్చుతాయని తెలుసు. ఈ సంభందం ఫిక్స్ చేసుకోవాలని మనస్సులో డిసైడ్ అయ్యాడు. కూతురు ఉండగానే మాట్లాడాలా వద్దా అని ఆలోచించి చివరకు తన ముందే చెబితే బెటర్ అని

“మీకు మధ్యవర్తి చెప్పే ఉంటాడు. కావ్య చదువుల్లో వెరీ గుడ్. డిస్టింక్షన్ స్టూడెంట్. ప్రస్తుతం నా కంపెనీ లో పని చేస్తుంది. మా రెండో అమ్మాయి సౌమ్య ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇద్దరూ వెరీ ఇంటెలిజెంట్. ఇద్దరు అమ్మాయిలే. మాకున్నది మా తర్వాత వాళ్ళిద్దరిదే”, అని హింట్ ఇచ్చాడు ఇండైరెక్ట్ గా.

కొంచెం సేపు మౌన మేలింది అక్కడ. “అమ్మాయి నేమైనా అడగాలనుకుంటే మొహమాట పడకండి”, అంది జానకి మౌనాన్ని ఛేదిస్తూ.

“అబ్బె, మా దేమి లేదండి. మాకు మీ కుటుంబం, కావ్య బాగా నచ్చింది. కాని శ్రీరామ్, అమ్మాయి మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలి”, అన్నాడు ప్రసాద్ రావు. వాళ్ళ పద్దతి బాగా నచ్చి. కొడుకు ఈ సంభందం ఒప్పుకుంటే జీవితంలో ఒక మెట్టు ఎక్కుతాడని.

వాళ్ళ మాటలతో కొంచెం తేలిక పడ్డారు. కాని అంతలోనే ఒక బాంబు పేల్చింది లలిత.
కావ్య వేపే చూస్తూ, “అన్ని వున్న నీ లాంటి అమ్మాయి భార్యగా దొరకటం అదృష్టం అనుకుంటారు ఈ వయస్సు కుర్రాళ్ళు. మా వాడు ఏమంటాడో. చదువుతో పాటు ఆర్థికంగా మాతో సరి పడే వాళ్ళని చూడమని చెప్పాడు. మధ్య వర్తి చెప్పిన దాన్ని బట్టి మీరు ఇంత స్థితిమంతులు అనుకోలేదు. తెలిసుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో. మేము చెప్పేది చెబుతాము, కాని వాడి ఇష్టాన్ని కాదనలేము. వాడొచ్చినప్పుడు మీరిద్దరూ మాట్లాడుకొని తేల్చుకోవాలి.”

ఆవిడ మాటలతో అత్త గారి మీద సదభిప్రాయం ఏర్పడింది కావ్యకు. ఆవిడ మాటల్లో తమ సంభంధం కుదిరితే బాగుండు అన్న కోరికతో పాటు, కొడుకు ఇష్టం కాదనే ప్రేమ వ్యక్తమయ్యాయి. పాఠాలు చెప్పే ఒక కాలేజీ లెక్చరర్ అనుభవంతో తన కొడుకు వ్యక్తిత్వం ఆలోచనలు మామ గారు చెప్పిన విధానం బాగా నచ్చింది. అంతే కాకుండా శ్రీరామ్ అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది తనలో.

మధ్యవర్తికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొన్నాడు. అవతలి వాళ్ళు ఎలాంటి సంభందం వెదుకుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టు చెప్పడం ఒక కళ. తమ ఆర్ధిక స్తోమతను హైలైట్ చేయకుండా అమ్మాయి గురించి చెప్పి వాళ్ళను పెళ్లి చూపుల వరకు తెప్పించడం నచ్చింది. పెళ్లి సంభందం కుదిరితే ఒక లక్ష ఇద్దామనుకొన్నది రెట్టింపు చెయ్యాలని అనుకొన్నాడు రాజారావు.

శ్రీరామ్ తో మాట్లాడి తను ఎప్పుడు వచ్చేది డిసైడ్ చేద్దామని సెలవు తీసుకొన్నారు ప్రసాదరావు దంపతులు.

పెళ్లి చూపులవ్వగానే తిన్నగా హోటల్ కి చేరుకొన్నారు ప్రసాద్ దంపతులు. వాళ్లకి కావ్య బాగా నచ్చింది. శ్రీరామ్ కి నచ్చి సంభందం కుదిరితే బాగుణ్ణు అని అనుకొన్నారు. వాడికి ఫోన్ చేసి చెప్పండి అని లలిత అన్నప్పటికీ “పనిలో ఉంటాడు. రేపు సాయంత్రం ఫోన్ చేద్దాములే”అని వారించాడు. ఆ సాయంత్రమే కాకినాడ వెళ్లి పోయారు.

గురువారం రాత్రి కొడుక్కి ఫోన్ చేసాడు ప్రసాద్ రావు. శ్రీరామ్ హలో చెప్పగానే స్పీకర్ ఫోన్ ఆన్ చేసాడు భార్య కూడా వింటుందని.

“నిన్నే ఫోన్ చేద్దామనుకున్నామురా. కానీ పనిలో బిజీగా ఉంటావని చెయ్యలేదు. అమ్మాయి తల్లి తండ్రులు కూడా చాలా మంచి వారు. మమల్ని బాగా రిసీవ్ చేసుకొన్నారు. అమ్మాయి కూడా చాలా బాగుంది అణుకువ ఉన్న పిల్ల. మాకు అన్ని విధాలా బాగుంది. కాకపొతే బాగా ధనవంతులు”,అన్నాడు ఏమి దాచకుండా

“మీకు ముందే చెప్పా కదా నాన్న. మరీ అంత డబ్బున్నవాళ్ళు ఒద్దని. తరువాత మనం, ఆ అమ్మాయి ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని.”

“మధ్యవర్తి కాస్త ఉన్నవారు అన్నాడు కాని మరి అంత ధనవంతులు అనుకోలేదురా. అమ్మాయికి అస్సలు గర్వం లేదు. నువ్వు ఒకసారి చూస్తే బాగుంటుంది.”అన్నాడు కొడుక్కి కొంచెం నచ్చ చెప్పేధోరణితో.

భర్తకు తోడు తనూ ఒక మాట సాయం చేద్దామని రంగంలోకి దిగింది లలిత. “వాళ్లకు మనకు చుట్టరికం కుదిరింది కూడాను. అసలు ఇంతకాలం కలుసుకోకుండా ఎలా ఉన్నామని అన్నారు మీ మామగారు. మనం సంభందం అంటే బాగా ఇష్టంగా ఉన్నారని తెలుస్తోంది. నీవు వచ్చి చూస్తావని మాటిచ్చాము. వెళ్లకపోతే బాగుండదు.”అంటూ కొంచెం నొక్కింది.

“అంత ధనికుల సంభందం చేసుకుంటే మీరు దూరమై పోయే అవకాశం ఉంది. ఇద్దరూ అమ్మాయిలు అంటున్నారు. ఒక్కోసారి వాళ్ళ వ్యాపారాలకు అల్లుళ్ళని వారసులుగా పెట్టు కోవాలనుకొంటారు నాన్న”, అంటూ పెళ్లి సంభందాలు వెదికే ముందు తాను చెప్పిన ఆందోళనను మళ్ళా చెప్పాడు శ్రీరామ్.

అలా కొంచెం సేపు మాట్లాడుకొని, చివరకు తాము ఫోన్ చెయ్యకుండా, వాళ్ళంతట వాళ్లే ముందుకు వస్తే వాళ్లకి ఇష్టం ఉన్నట్టు అని, మాట ఇచ్చినందుకన్నా అప్పుడు శ్రీరామ్ తప్పక వెళ్లాలని చెప్పి ముగించారు ప్రసాద్రావు దంపుతులు.

********

శుక్రవారం వాళ్ళ ఫోన్ గురించి ఎదురు చూస్తూ గడిపాడు రాజారావు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత భర్త కొంచెం మూడీగా ఉండటం చూసి అక్కడనుంచి ఫోన్ రాలేదని గ్రహించి, అతనిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏమయ్యిందని అడగలేదు. ఒక పక్క కూతుర్ని గమనిస్తుంది. అది కూడా పొద్దున్నంతా పైకి, కిందికి తిరగడం, హాల్లో ఊరికే టీవీ చానెల్స్ మారుస్తుండడం గమనించింది. భోజనాలయిన తరువాత కావ్య తన రూమ్ కి వెళ్ళిపోయింది. అన్ని సర్దుకొని హాల్లో కూర్చున్నారు.

“అమ్మాయిని బుధవారం చూసారు, అబ్బాయితో కనీసం నిన్న మాట్లాడి వుంటారు. మరీ ఇవ్వాళ్ళయినా మనకి ఫోన్ చెయ్యాలి కదా.”అన్నాడు తన ఆత్రుత కనపడనీయకుండా.

“అబ్బాయితో మాట్లాటడం కుదర లేదేమో. లేకపోతె మీకు ఖాళీగా ఉంటుంది వారాంతం లో చేద్దామని ఆగారేమో”, అంది సమాధాన పరుస్తూ.

175742cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *