మేము క్యాంటీన్ కు వెళ్లి ఒక టేబుల్ చూసుకుని కూర్చున్నాం.
“ఏం తిందాం?” అని అడిగాడు బావ.
“నీ ఇష్టం” అన్నాను.
బావ టూ ప్లేట్స్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో నాకు ఒక డౌట్ వచ్చింది. బావను అడగాలనిపించింది.
“బావా…!” అని పిలిచాను.
“ఆ..” అంటూ నా వైపు చూశాడు.
“నాకు ఊరెళ్తున్నాను అని చెప్పి అన్నయ్య దగ్గరికి ఎందుకు వెళ్లావ్ రా?” అడిగేశాను.
“ఒక పర్సనల్ పని మీద వెళ్లాను” అని చెప్పాడు.
“అంటే నాకు చెప్పకూడదా?” అని అడిగాను.
“దానికి అర్థం అదే కదా” అన్నాడు నవ్వుతూ.
“సరేలే. ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే తెలివైనవాడివి” అన్నాను.
“మరేమనుకున్నావ్” అన్నాడు కాలర్ ఎగరేస్తూ.
“చెప్తావా? చెప్పవా?” అని అడిగాను.
“అది నీకు తప్పా ఎవరికైనా చెప్పొచ్చు. కానీ నీకు చెప్పాలంటే ఇంకా టైం ఉంది” అన్నాడు.
“ఐతే అన్నయ్యను అడిగేస్తాను” అన్నాను.
“నాకు వాడి మీద నమ్మకం ఉంది. ఈ విషయం మాత్రం నీకు చెప్పడు” అన్నాడు.
“సరే పో ఏదో టైం రావాలి అన్నావుగా, అప్పటివరకు వైట్ చేస్తా” అన్నాను.
ఇంతలో ఆర్డర్ చేసిన ఇడ్లీ వచ్చింది.
“టైం కాదు ఇడ్లీ వచ్చింది తిను” అన్నాడు.
నేను ఫక్కున నవ్వేసాను. నేను నవ్వడం చూసి వాడు కూడా నవ్వాడు. అలా నవ్వుకుంటూ టిఫిన్ తినేసి బయటికి వచ్చాం.
“తరువాత ఏంటి ప్రోగ్రాం?” అన్నాను కళ్లు ఎగరేస్తూ.
“ఏం లేవు. నువ్వు హాస్టల్ కు, నేను రూంకు” అంటూ నడవబోయాడు.
“నేను వాడి షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి “పొద్దున్నే రెడీ అయ్యి నీతో ఉండాలని వస్తే నువ్వేంటి ర వెళ్లిపోదాం అంటావ్” అన్నాను.
“సరే ఎక్కడికి వెళదాం?” అన్నాడు.
నేను టైం చూస్తే 10:40 అవుతోంది.
“సినిమా కు వెళదాం” అన్నాను.
“ఇప్పుడేం మంచి సినిమాలు లేవుగా?” అన్నాడు.
“ఏదో ఒకటి వెళ్దాం” అన్నాను.
“సరే పద” అంటూ నడిచాడు.
ఇద్దరం అలా నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా వచ్చాం. బస్సు రాగానే ఎక్కేసి థియేటర్ దాక వెళ్లాం. వెళ్లి చూస్తే అక్కడ హౌస్ ఫుల్ అని బోర్డ్ పెట్టేశారు. ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. ఏం చేద్దాం అన్నట్లు సైగ చేశాడు బావ. ఏమో అన్నట్లు సైగ చేశాను నేను.
“పద వెళదాం” అన్నాడు బావ.
“ఎక్కడికీ?” అన్నాను.
“నేను రూంకి, నువ్వు హాస్టల్ కీ” అన్నాడు.
“ఉహూ…బావా” అన్నాను గోముగా.
“సరే ఏం చేద్దామో నువ్వే చెప్పు” అన్నాడు.
“ఐతే నాతో రా” అన్నాను.
“ఎక్కడికీ?” అని అడిగాడు.
“ఏం మాట్లాడకుండా రా బావా” అంటూ చేయి పట్టుకుని లాగాను.
“తప్పుతుందా? పద” అన్నాడు.
నేను బావను చికెన్ షాపుకి తీసుకెళ్లి అరకిలో చికెన్ తీసుకు రమ్మన్నాను. బావ ఏం మాట్లాడకుండా వెళ్లి తీసుకొచ్చాడు. ఇద్దరం మళ్లీ బుస్సు ఎక్కి మేముండే ఏరియాకి వెళ్లిపోయాం. అక్కడ ఒక చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి కొనుక్కుని ఇంకా కావలసిన కూరగాయలు కొని రూంకు వెళ్లిపోయాం. వెళ్లడం తోనే బాగా అలసిపోయిన వాడిలా బెడ్ రూంలో దూరి బెడ్ పై వాలాడు బావ. నేను వంట రూంలోకి వెళ్లి వంట చేయడం ప్రారంభించాను. సరిగ్గా 12:15 గంటలకు వంట చేయడం పూర్తి అయిపొయింది. నేను బావ దగ్గరికి వెళ్లి చూస్తే మొద్దు నిద్రలో ఉన్నాడు.
“బావా…బావా…” అంటూ లేపాను.
బావ లేచి నన్ను చూసి ఏంటి అన్నట్లు కళ్లు ఎగరేశాడు.
“భోం చేద్దాం రా బావ” అన్నాను.
“నువ్వు తినెయ్, నేను తరువాత తింటాను” అన్నాడు.
“అదేం కుదరదు. వెళ్లి ముఖం కడుక్కుని తినడానికి రా” అన్నాను.
“పోవే…” అంటూ కళ్లు మూసుకున్నాడు.
“లెయ్ బావా” అంటూ చేయి పట్టుకుని లేపాను.
దాంతో వాడు బెడ్ మీద కూర్చున్నాడు.
“హాలిడే రోజు కూడా నాకు ఏంటి టార్చర్” అన్నాడు.
“నాకు చెప్పకుండా అన్నయ్య దగ్గరికి వెళ్లావు కదా అందుకే” అన్నాను. వాడు నన్ను ఒకసారి చూశాడు.
“ఏంట్రా అలా చూస్తున్నావ్?” అని అడిగాను.