ప్రేమ

Posted on

అజయ్ …
మనం ఊటీ వెళ్ళడానికి వారం ముందు ఒకరోజు మా నాన్న నా గదికి వచ్చాడు… నాతో కాస్త మాట్లాడాలి అన్నాడు… నీకు తెలుసనుకుంటా మా నాన్న గారికి ఒక చిట్ ఫండ్ ఉండేది అని… దాన్ని మరో ఇద్దరు పార్టనర్స్ తో కలిపి నడిపేవాడు… వాళ్ళిద్దరూ మోసం చేయడం వల్ల చిట్ వినియోగదారుల డబ్బంతా నాన్న కట్టవలసిన స్థితి వచ్చింది… మాకున్న ఆస్తులన్నీ అమ్మినా సగం కూడా సరిపోని స్థితి … మా నాన్న గారు చాలా మంది దగ్గరికి తిరిగాడట… ఒక రోజు ఒకాయన దగ్గర మాట్లాడుతుంటే వాల్లబ్బాయి రాకేష్ కూడా అక్కడే ఉన్నాడట. మాటల మధ్యలో రాకేష్, నేను ఒకే కాలేజ్ అని తెలిసిందట… తను నాకు సీనియర్ అట కాలేజిలో..

రెండు రోజుల తర్వాత రాకేష్ మా నాన్న గారిని కలిశాడట…
చాలా రోజులుగా అతను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే నాన్నగారికి సహాయం చేస్తానని అన్నాడట… వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడించాడట…
నాన్న నన్ను అడిగి చెప్తానని వచ్చాడట….
ఇదే నాన్న నా దగ్గర చెప్పిన విషయం….

నేను నీతో ప్రేమలో ఉన్న విషయం నాన్నకి చెప్పాను…
దానికి నాన్న… చూడమ్మా నిజానికి నేను రాకేశ్ కి సరే అనే చెబుదాం అనుకున్నా… కానీ ఒక మాట నిన్ను అడగడం న్యాయం అనుకొని వచ్చాను… కానీ ఇప్పుడు నువ్వు ఎవర్నో ప్రేమించాను అంటున్నావు… కాబట్టి నిన్ను బలవంతం చేయను…అన్ని విషయాలూ నీకు చెప్పాను…ఏం చేయాలన్నది నువ్వే నిర్ణయించుకో… కానీ నిర్ణయం తీసుకునే ముందు నీ నిర్ణయం మీదే మన కుటుంబ భవిష్యత్తు, నీ ఇద్దరి చెల్లెళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉందని మాత్రం గుర్తుంచుకో… అంతే కాదు పైసా పైసా కూడబెట్టి మన దగ్గర చిట్ కట్టిన వేల కుటుంబాలు కూడా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి… బాగా ఆలోచించి ఏదో ఒకటి చెప్పు….. అంటూ వెళ్లిపోయాడు….
నాకు ఏం చేయాలో అర్థం కాలేదు….

మర్నాడు కాలేజ్ లో రాకేశ్ నన్ను కలిశాడు… నేనంటే తనకి చాలా ఇష్టం అని చెప్పాడు… కానీ నేను “నిన్ను” ప్రేమిస్తున్నాను అని రాకేశ్ తో చెప్పాను… అయినా ఫరవాలేదు పెళ్లి చేసుకుంటా అన్నాడు… నేను అతనికి నచ్చజెప్పెందుకు చూసాను… కానీ అతను వినలేదు… బలవంతం ఏమీ లేదని… ఇష్టం లేకపోతే వద్దని అంటూనే…. నాన్నకు సహాయం కావాలంటే మాత్రం పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వెళ్లిపోయాడు… వెళ్ళేముందు పదిహేను రోజులు గడువు విధించి వెళ్ళాడు…
రోజూ నాన్న నీ నిర్ణయం ఏంటీ అన్నట్టు చూసేవాడు…నాకేం చెయ్యాలో తోచలేదు…
బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను…

అజయ్…
నువ్ చాలా సార్లు అంటుంటే వాడివి… తనను ప్రేమించే వాళ్ళ సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనకాడకూడదు అని… అయితే ప్రేమ అనేది కేవలం ప్రేయసీ ప్రియుల మధ్యే ఉంటుందా… తల్లిదండ్రులు, తోబుట్టువుల మధ్య ఉండేది ప్రేమ కాదా… మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచీ ఎంతో ప్రేమగా పెంచాడు… ఆఖరికి ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా నన్ను బలవంతం చేయకుండా నిర్ణయం నన్నే తీసుకోమన్నాడు… నా మీద ఎంత ప్రేమ ఉంటే అలా చేయగలడు…
అందుకే నన్ను అంతగా ప్రేమించే నాన్న కోసం నీ ప్రేమని వదులుకోవడానికి నిర్ణయం తీసుకున్నాను…

అజయ్…
కులం, మతం, ఆస్తి లాంటి కారణాలతో నాన్న మన ప్రేమను నిరాకరిస్తే కచ్చితంగా నాన్న ప్రేమని వదులుకొని నీ దగ్గరకు వచ్చేదాన్ని… కానీ ఇప్పుడు కారణం అవేవీ కాదు…
మన ప్రేమ బతకాలంటే నా కుటుంబంతో పాటు అనేక కుటుంబాలు రోడ్డున పడాలి.… మనకు అది మంచిది కాదు అనిపించింది… అందుకే నీ ప్రేమని వదులుకోవాలి అనుకున్నాను…

నీతో కూడా ఇవన్నీ చెప్పాలని అనుకున్నాను… నిజానికి నా స్థానంలో నువ్వు ఉన్నా నేను తీసుకున్న నిర్ణయమే తీసుకునేవాడివి అనిపించింది… ఎందుకంటే మనిద్దరమూ ఎప్పుడూ ఒకేలా ఆలోచించే వాళ్ళం… అందుకే నీకు చెప్పాలని అనుకున్నా…. కానీ అంత సడన్ గా చెప్తే నువు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు… అందుకే నీతో చెప్పలేదు…

అంతలోనే నాకు ఇంకో భయం మొదలయ్యింది…రాకేశ్ తో పెళ్ళయితే నిన్ను నేను కలవలేను…
నేను చెప్పకపోయినా నీకు విషయం తెలిసిపోతుంది…
అంత సడన్ గా నేను నీకు దూరం అయితే నువ్ తట్టుకోలేవు అని నాకు తెలుసు… నువ్ సరిగ్గా చదవకపోయినా, ఏ తాగుడుకో అలవాటు అయినా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా, ఏదైనా చేసుకున్నా నేను తట్టుకోలేను….
నా కుటుంబం కోసం నీ జీవితాన్ని నాశనం చేసినదాన్ని అవకూడదు అని ఆలోచించాను…
బాగా ఆలోచించాకే నిన్ను ఊటీ తీసుకెళ్ళమని అడిగాను … అక్కడ ఆ ప్రశాంత వాతావరణంలో సెటిల్ అయ్యే వరకూ మనం కలుసుకోవడానికి వీల్లేదు అనే కండిషన్ కి నిన్ను ఒప్పించాను… నా వల్ల నీ చదువు, కెరీర్ నాశనం కావద్దనే నా లక్ష్యం నెరవేర్చుకున్నాను… బోనస్ గా ఊటీలో మరిన్ని “మధురానుభూతులు” కూడా నాకు లభించాయి…
ఈ జీవితానికి ఇవి చాలు నాకు…
నీ జ్ఞాపకాలతో జీవితమంతా గడిపేస్తాను…

అజయ్…
నువు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను ఎక్కడుంటానో ఎలా ఉంటానో నాకే తెలియదు… కానీ ఎక్కడున్నా, ఎలా ఉన్నా నేనెప్పుడూ నీకు మంచి జరగాలనే కోరుకుంటాను…

చివరగా నాది ఒక్క కోరిక అజయ్…

నువు ఇప్పుడు మంచి జాబ్ సంపాదించి మంచి కెరీర్ ని ఆరంభించి ఉంటావు…
నాకోసం కోటి ఆశలతో వచ్చి ఉంటావు…
కానీ నేను నీ ఆశలన్నీ తుంచేసాను అని బాధ పడవద్దు …
నైరాశ్యంలో కూరుకుపోవద్దు
నీవు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నా కోరిక…

నా కోరిక తీరుస్తావు కదూ…

ఇట్లు

నీ ప్రేమని సంపూర్ణంగా అనుభవించే అదృష్టం లేని అభాగ్యురాలు

దివ్య”

ఉత్తరం ఆసాంతం చదివాక నా కళ్ళలోంచి ధారగా నీళ్లు కారుతున్నాయి… మనసంతా శూన్యంగా మారిపోయింది
నేను ప్రాణంగా ప్రేమించిన దివ్య నాకు అందకుండా పోయిందనే బాధ గుండెని పిండేస్తున్నా దివ్య చూపిన పరిణతి నాకు దివ్యమీదున్న ప్రేమని మరింత పెంచింది….

మర్నాడు ఉదయం ఆఫీస్ లో… వారం రోజులు సెలవు పెట్టేసి వెళ్లి ఒక్కరోజులో తిరిగొచ్చిన నన్ను అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఎవర్నీ పట్టించుకోకుండా నా క్యాబిన్ లోకి వెళ్లి బ్యాగ్ లోంచి దివ్య ఫోటో తీసి కంప్యూటర్ పక్కన పెట్టుకొని లాగిన్ అయ్యాను…

213021cookie-checkప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *