నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 12

Posted on

“నా ఉదయ్ గురించి చెప్పాలి!” అందామె నిశ్చలంగా.
“ఉ-ఉ-ఉదయ్—?” శంకర్ అవాక్కయ్యాడు. కనుబొమ్మలు చిట్లిస్తూ, “అయితే, వాడి కోసమే నాతో అబద్ధం చెప్పి—” అని కోపంగా అనబోతుండగా శ్రీదేవి, “మీరు…. ఉదయ్ ని కలుస్తారా…?” అనడిగింది. అంతే, శంకర్ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఆమెనే మళ్ళీ, “ఈరోజే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను… అక్కడే మీకంతా చెప్తాను,” అంది దృడమైన స్వరంతో.

★★★

శంకర్ అంజలితో ఆరోజు తను స్కూలుకు సెలవు పెడుతున్నట్టుగా చెప్పి శ్రీదేవితో కలిసి రాజమండ్రి బయలుదేరాడు.
ఎందుకో… ఆ సదరు ఉదయ్ ని కలవడం శంకర్ కి అస్సలు ఇష్టం లేదు. భార్య బోయ్ ఫ్రెండును కలవటం ఏ మగడికి నచ్చుతుంది లెండి…! అయితే, శ్రీదేవి చెప్పే నిజం ఏంటో తెలుసుకోవాలని అతని మనసు ఆరాటపడుతోంది. అలా తను ఆలోచనల్లో మునిగివుండగా బస్సు రాజమండ్రి చేరుకుంది.
మరో పది నిముషాల తరువాత పప్పుల వీధిలోని గంటమ్మ గుడి ప్రక్కన వున్న ఒక ఇంటి ముందు ఆటో దిగారా యిద్దరూ. శ్రీదేవి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టింది. సుమారుగా యాభై యేండ్లు వయసున్న ఒకాడావిడ తలుపు తెరచి, “శ్రీదేవీ… బావున్నావమ్మా…?” అంటూ ఆప్యాయంగా పలకరించింది. శ్రీదేవి ‘బావున్నా’నన్నట్టుగా తలూపి లోపలికి నడిచింది. శంకర్ కూడా ఆమె వెనకాలే లోపలికి అడుగుపెడుతూండగా, “రండి అల్లుడుగారూ…!” అంది ఆవిడ.
శంకర్ విస్తుపోయి ఆవిడ వంక చూస్తూ హాలులోకి వచ్చాడు.
శ్రీదేవి అతని మనసులోని సందేహాన్ని చదివినట్టుగా, “ఈమె పేరు లక్ష్మమ్మ…. మీతో అప్పుడప్పుడు మా అమ్మలా మాట్లాడింది తనే!” అంటూ ఆవిడని పరిచయం చేసింది.
లక్ష్మమ్మ శంకర్ కి నమస్కరించి, “కూర్చోండి బాబూ…” అంది. శంకర్ ఆమె వంక గుర్రుగా చూస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
ఆ తర్వాత శ్రీదేవి లక్ష్మమ్మకి కళ్ళతోనే ఏదో సైగ చేసింది. లక్ష్మమ్మ వెంటనే లోపలికెళ్ళిపోయింది. శంకర్ ఆమె వెళ్ళపోవటాన్ని చూస్తూ యధాలాపంగా ఓసారి ఆమె వెళ్తున్న దారి వైపు దృష్టి నిలిపాడు. వరసగా రైలు పెట్టెల్లాగ రెండు గదులు కన్పించాయి. అలాగే తామున్న హాల్ ని కూడా ఓసారి పరికించి చూసాడు. ఎక్కడికక్కడ బూజులు పేరుకుపోయి వున్నాయి. ‘శ్రీదేవి తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? ఆ ఉదయ్ ఏడి…?” అనుకుంటూ తన ప్రక్కనే నిలబడి వున్న శ్రీదేవి వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
అప్పుడే లోపలి గదిలోంచి లక్ష్మమ్మ ఓ అయిదారేళ్ళ వయసున్న బాబును ఎత్తుకుని తీసుకువచ్చింది. ఆ బాబు శ్రీదేవిని చూసి, “అమ్మా….! వచ్చేశావా…?” అని అరుస్తూ లక్షమ్మ మీదనుంచి దిగిపోయి శ్రీదేవి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. శ్రీదేవి కూడా ఆ బాబు దగ్గరకు వడివడిగా అడుగులు వేస్తూ పోయి, “ఉదయ్…! నా బంగారు కొండా…!” అంటూ వాణ్ణి ఎత్తుకుని ప్రేమగా బుగ్గల్ని ముద్దాడింది.
అది చూసి శంకర్ కుర్చీలోంచి దిగ్గున లేచాడు. ‘ఉదయ్…అంటే…ఈ చిన్న బాబునా?’ అతనికి మైండు బ్లాంక్ అయిపోయింది.
“మూడ్రోజుల బట్టీ నీనుంచి ఫోన్ లేకపోవడంతో ఉదయ్ చాలానే బెంగ పెట్టుకున్నాడు, దేవీ!. అన్నంకూడా సరిగ్గా తినకుండా ‘అమ్మతో మాట్లాడాలి…!’ అంటూ ఒకటే గోల… ఇవాళ పొద్దున్న కూడా నువ్వు వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పావని చెప్తేనే భోంచేశాడు. రాను రానూ మరీ మొండిగా తయారవుతున్నాడనుకో, నీ పుత్రరత్నం…!” అంటూ లక్ష్మమ్మ శ్రీదేవి ప్రక్కకు వచ్చింది.
‘పుత్ర-రత్నం….? ఈ ఉదయ్.. శ్రీదేవి కొడుకా? తన భార్య…. ఒక బిడ్డకు తల్లి…?’ అంతా నమ్మశక్యంగా లేదు అతనికి. కాళ్ళ క్రింద భూమి కదిలినట్టయి కుర్చీ చేతిని ఆసరాగా పట్టుకున్నాడు.

అటు ఉదయ్ కూడా శ్రీదేవిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె వెనకనున్న శంకర్ వైపు వింతగా చూసి, “అమ్మా… ఈ అంకుల్ ఎవరు?” అని అడిగాడు.
శ్రీదేవి తల తిప్పి శంకర్ వైపు చూసింది. శంకర్ అక్కడే వున్నాడన్న సంగతిని ఒక్క క్షణం తను మర్చిపోయింది. తను అలా తిరగ్గానే ఆమె చెంప మీద కమిలిన ఎర్రని గుర్తుని చూసి ఉదయ్, “అమ్మా… ఏంటిది..?” అంటూ అక్కడ చెయ్యి వేసి పామాడు. శ్రీదేవి కాస్త నొప్పిగా అనిపించి వాడి చేతిని పట్టుకొని ఆపి, “కన్నలూ… నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో… నేను కాసేపట్లో వస్తానేఁ..!” అని చెప్పి వాడ్ని క్రిందకి దింపింది. వాడు శంకర్ ని ఆసక్తిగా చూస్తున్నాడు. శ్రీదేవి తన బ్యాగ్ లోంచి ఓ చాక్లెట్ ని తీసి వాడికి ఇచ్చి లక్ష్మమ్మతో వాడ్ని లోపలికి తీసుకెళ్ళమని చెప్పింది.
శంకర్ కి అంతా గజిబిజిగా వుంది. శ్రీదేవి తన ప్రియుడ్ని కలవటానికి వస్తోందని అనుకున్నాడు. కానీ, తను ఇక్కడ ఏకంగా ఓ పిల్లాడ్ని కనేసి రహస్యంగా పెంచుతోంది.! ‘ఆరేళ్ళ పిల్లాడు…!?! ఇంకా ఏం నిరూపించాలని తనని ఇక్కడకి తీసుకొచ్చింది…?’
ఉదయ్ లోపలికి వెళ్ళిపోగానే శ్రీదేవి శంకర్ తో, “ఏఁవండీ…! ఉదయ్… నా సొంత బిడ్డ కాదు… నా అక్క కొడుకు,” అంది శంకర్ మనసులో ప్రశ్నకు జవాబుగా.
“ఏంటీ—? న్-నీకో అక్క కూడా వుందా?” అన్నాడు శంకర్ ఆశ్చర్యపోతూ.
“ఊ…. ఇప్పుడు లేదు!”
“నాకేం అర్ధం కావటంలేదు…! పెళ్ళి సంబంధం కుదుర్చుకునేప్పుడు మీ అమ్మ తనకి నువ్వొక్కత్తివే సంతానమని చెప్పిందిగా..! మళ్ళా ఈ అక్క ఎక్కడ్నుంచి వచ్చిందీ?” అని అడిగాడు వెంటనే…
“ఔనండీ… మా అమ్మకి నేనొక్కదాన్నే సంతానం. అఁ—”
“ఒసేయ్…. పిచ్చెక్కించేస్తున్నావ్ కదే! మీ అమ్మకు నువ్వు ఒక్కదానివే అంటున్నావ్… మళ్ళా నీకో అక్క వుందని అంటున్నావ్….(అంటూ గట్టిగా పళ్ళు బిగించి) అసలేంటిదంతా….? సరిగ్గా చెప్పవేఁ..” అన్నాడు శంకర్.
శ్రీదేవి ఓసారి గాఢంగా వూపిరి పీల్చుకొని, “చెప్తానండీ…. అంతా చెప్తాను…. ముందు మీరు కూర్చోండి…!” అంది.
శంకర్ శ్రీదేవి వంక అసహనంగా చూస్తూ మళ్ళా కుర్చీలో కూర్చున్నాడు.
శ్రీదేవి అలాగే నిలబడి చేతులు కట్టుకుని చెప్పడం ప్రారంభించింది.
“మా అమ్మ, మా నాన్నగారికి రెండో భార్య…. మొదటి భార్య మా అక్కకి జన్మనిస్తూ చనిపోయింది. అక్కయ్య పేరు సరస్వతి. నాన్న అక్కను ప్రేమగా చూసుకుంటుందని అమ్మను పెళ్ళిచేసుకున్నాడు.
కానీ, తను అక్క పట్ల సవతి తల్లి ప్రేమనే చూపించింది. నాకు మాత్రం చిన్నప్పటినుంచీ అక్కంటే ప్రాణం. ఎప్పుడూ అక్కతోనే ఆడుకునేదాన్ని. తను కూడా నన్ను అక్కలా కాకుండా మరో అమ్మలా చూసుకునేది. నాపై ఎంతో ప్రేమని కురిపించేది. అమ్మ అక్కకి పదో తరగతితో చదువును ఆపించడానికి చూస్తే నేనే పట్టుబట్టి తను చదువును కొనసాగించేలా చేశాను. తను స్వతహాగా మెరిట్ స్టూడెంటు కావటంచేత స్కాలర్‌షిప్పులు కూడా తనకి వచ్చేవి. దాంతో, తను మాకు దూరంగా పట్నంలో కాలేజీ హాస్టల్ లో ఉండి చదువుకునేది.
అలా తను ఇంజనీరింగ్ చదివేప్పుడు తన క్లాస్ మేట్ ఒకతన్ని ప్రేమించింది. అతను తక్కువ కులానికి చెందినవాడు. పైగా అనాధ. వాళ్ళ ప్రేమ సంగతి తెలుసుకున్న అమ్మ దాన్ని ఓ అవకాశంగా వుపయోగించుకుని నానా రాద్ధాంతం చేసి అక్కని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అమ్మ నోటికి జడిసి నాన్న కూడా ఏం చేయలేకపోయారు. అయితే, ఆ అబ్బాయి చాలా మంచివాడు. పట్నంలో ఉద్యోగం సంపాదించి అక్కను పెళ్ళి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. నేను అమ్మకి తెలీకుండా అప్పుడప్పుడు వెళ్ళి అక్కా బావల్ని కలిసి వస్తుండేదాన్ని. వాళ్ళ సంసారం చూడ ముచ్చటగా వుండేది. అలా అంతా సంతోషంగా గడిచిపోతుండగా ఆరు సంవత్సరాల క్రితం వారి జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. బావ రోడ్డు యాక్సిడెంటులో చనిపోయారు. దాంతో, అక్క చాలా కృంగిపోయింది. అప్పటికే తను నిండు గర్భిణి. అక్కను సముదాయించటానికి నేను ఎంతో ప్రయత్నించాను. కానీ, తను ఆ బాధనుంచి తేరుకోలేకపోయింది. ఆ ప్రభావం తన కాన్పు పై పడింది. చివరికి ఉదయ్ కి జన్మనిచ్చి వాడ్ని నా చేతుల్లో పెడుతూ తను… కన్నుమూసింది. ‘శ్రీదేవీ…. నా బాబుని అనాధను కానివ్వకు… ఇకనుంచి నువ్వే వాడికి తల్లివి కావాలి… వీడు మా ప్రేమకు ప్రతిరూపం…’ అంటూ తను నాకు చెప్పిన చివరి మాటలు నా చెవుల్లో ఇంకా మార్మోగుతూనేవున్నాయి…
అయితే, ఉదయ్ ని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. “ఈ దరిద్రాన్ని ఎందుకే ఇంటికి తీసుకొచ్చావ్… మనకు కూడా వీడివల్ల శని చుట్టుకోవటానికా… పుట్టకుండానే తండ్రిని, పుట్టిన వెంటనే తల్లినీ మ్రింగేశాడు వెధవ… వీడు ఈ ఇంట్లో వుండటానికి వీల్లేదు. తీసుకెళ్ళి అనాధ శరణాలయంలో తగలెయ్..!” అంటూ నాపై తీవ్రంగా అరిచేసింది. తను చెప్పింది చెయ్యకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్ గా బ్లాక్మైల్ చేయడంతో అమ్మకు తెలీకుండా మా దూరపు బంధువైన ఈ లక్ష్మమ్మ సాయంతో ఉదయ్ ని ఇక్కడ రహస్యంగా ఈ ఇంట్లో వుంచాను. ప్రతీ నెలా వెళ్ళి వాడ్ని చూసి వాళ్ళకు కావలసినవి అన్నీ సమకూర్చి వస్తూండేదాన్ని.
మీతో పెళ్ళి కుదిరినప్పుడు మిమ్మల్ని కలిసి ఉదయ్ గురించి మీకు చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ, మన పెళ్ళయ్యేంతవరకూ మీతో పర్సనల్ గా మాట్లాడేందుకు మా అమ్మ వీలు కల్పించలేదు. పోనీ, మొదటిరాత్రి మీతో చెప్దామని అనుకుంటే — ‘మూడేళ్ళవరకూ మనకు పిల్లపీచూ ఎవరూ వద్దు. నువ్వూ, నేనూ హేపీగా ఎంజాయ్ చేద్దాం’ అన్నారు మీరు. నాకు మీ గురించి ఏమీ తెలీదు.

162220cookie-checkనాకెందుకు అబద్దం చెప్పారు? – Part 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *