మిత్రమా …… కొన్ని ఘడియల్లో స్వయంవరం – అమ్మవారిని దర్శించుకుని మళ్లీ రాజ్యానికి రావాలి .
అలా చెప్పడం ఆలస్యం …… వేగాన్ని అందుకున్నాడు మిత్రుడు .
మంజరీ …… సామాన్యుడినైన నేను స్వయంవరం కోసం రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో , ఒకవేళ ప్రవేశించినా ఏ రాజ్యానికి యువరాజుని అని చెప్పాలో ఉపాయమే బోధపడటం లేదు – అక్కడేమో దేవకన్యకు మాటిచ్చేసాను స్వయంవర సమయానికి తన ముందు ఉంటానని ……
మంజరి : అమ్మవారి చెంతకు వెళుతున్నాముకదా ప్రభూ …… , మీఇద్దరి స్వచ్ఛమైన ప్రేమను ఒక్కటి చేసేందుకైనా అమ్మవారే ఒక దారిని చూయిస్తారు పదండి …….
మా మంజరి మాటలు నిజమవ్వాలి అంటూ ముద్దుపెట్టి , రెక్కలు ఆరేంతవరకూ గట్టిగా పట్టుకోమని చెప్పి మరింత వేగంతో పోనిచ్చాను – అమ్మవారి ఆలయం చేరుకున్నాము .
మంజరితోపాటు దేవాలయపు ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతంగా అనిపించింది . ప్రాంగణంలోని పూలమొక్కల నుండి అప్పుడే పూచిన పూలు కోసుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము .
అమ్మా …… తొలిసారి మీ దర్శనం చేసుకున్నాను – ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే యువరాణిని కలిశాను , యాదృచ్చికమో మీ అనుగ్రహమో ……. ఆ క్షణమే గురువుగారి కోరిక వైపు అడుగులుపడ్డాయి .
ముందుగా మీ భక్తురాలైన్ మహి …… తన తరుపున మీ దర్శనం చేసుకోమని నన్ను పంపినది – మహి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రార్థించాను .
అమ్మా …… మీకు తెలియనిది కాదు ఎలాగైనా ఈ గండం గట్టెంకించాలి అంటూ మొక్కుకున్నాను – ఏ ఆటంకం రానీకుండా ప్రభువుల సమక్షంలో యువరాణి చేతిని అందుకునేలా మీరే చెయ్యాలి ……..
ఆశ్చర్యంగా మంజరి తడి రెక్కలతోనే అమ్మవారి విగ్రహం భుజంపైకి చేరింది – ఏదో విన్నట్లు ……. నాదగ్గరకువచ్చి ప్రభూ నాతోపాటు రండి అంటూ బయటకు ఎగురుకుంటూ వెళ్ళింది .
అమ్మవారికి మొక్కుకుని , బయటకువెళ్లి మిత్రమా అంటూ పరుగునవెళ్లి ఎక్కి వేగంగా వెనుకే చాలాదూరం వెళ్ళాను దక్షిణం వైపుగా …….
చిరులోయ దగ్గర ఆగి నా భుజంపైకి చేరింది – ప్రభూ …… అల్లంతదూరంలో చూడండి , నిన్నరాత్రి పడిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడటంతో రాజ్యానికి వెళ్లే ఈ మార్గం మొత్తం ఆనవాలు లేకుండా కిందకు కొట్టుకుపోయింది , ఈ దారిన స్వయంవరం కోసం ఏకంగా చిన్నపాటి సైన్యంతో పాటు వస్తున్న ఒక యువరాజు ఎటువెళ్ళాలో తెలియక ఈ దట్టమైన అరణ్యంలో రాత్రంతా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు , వీరిని చాకచక్యంగా మరొక దారివైపు మరల్చామంటే వీరి రాజ్యం తరుపున మనం దర్జాగా వెళ్లిపోవచ్చు …….
మంజరీ ……. అలా చేయడం ……
మంజరి : తప్పే కాదు ప్రభూ ……. , నిజానికి ఈ ఉపాయం ఇచ్చినది అమ్మవారే , ఎలాగో యువరాణి ….. మీకు మాత్రమే సొంతమైనప్పుడు వీరు స్వయంవరానికి వస్తే ఎంత రాకపోతే ఎంత చెప్పండి .
అంతేనంటావా మంజరీ ……
అంతే అన్నట్లు మంజరితోపాటు మిత్రుడు కూడా ఊ కొట్టాడు .
సరే అయితే సమయం లేదు పదండి , వారి రాజ్యమేదో తెలుసుకుని రాజా ముద్రిక అయిన ఉంగరాన్ని సంపాదించాలి – మంజరీ …… అక్కడ మాత్రం నువ్వు సాధారణ చిలుకలానే ప్రవర్తించాలి సరేనా …….
మంజరి : అర్థమైంది పభూ ……. , నా పలుకులను చూసి బంధించి తీసుకెళ్లిపోతారనే కదా , అయినా కాపాడటానికి నా ప్రభువు ఉన్నారుకదా …… , సరే సరే ఆ చిన్నపాటి సైన్యాన్ని చిత్తు చిత్తు చేసి నన్ను కాపాడగలరు కానీ ఇప్పుడు అంత సమయం లేదు కదూ …… , అలాగే ప్రభూ …… మీరు ఎలచెబితే అలా అంటూ తెగ మాట్లాడేస్తోంది .
పెదాలపై చిరునవ్వుతో మంజరికి ముద్దుపెట్టి విరిగిపడిన కొండ చరియల మార్గంలోనే కష్టంగా అటువైపుకు చేరుకుని , ఏమీ తెలియనట్లు ఈ అడవి గురించి నాకు తెలియదా అంటూ పాటల రూపంలో పాడుకుంటూ వారి గుండా ముందుకుపోతున్నాను .
నలుగురు సైనికులు అడ్డుగా నిలబడి , రేయ్ …… మా యువరాజుగారు పిలుస్తున్నారు పదా అన్నారు .
పదండి అంటూ కిందకుదిగి వెనుకే వెళ్ళాను .
యువరాజు ప్రక్కన సైన్యాధ్యక్షుడు అనుకుంటాను – రేయ్ చంద్ర రాజ్యానికి వెళ్ళడానికి వీ మార్గమేమైనా ఉందా ? .
ఎందుకులేదు యువరాజావారూ ……. ఇలానే నిన్నకూడా ఒక యువరాజు ఈ మార్గంలో తప్పిపోతే సరైనమార్గంలో పంపించాను .
సైన్యాధ్యక్షుడు : అయితే తొందరగా చెప్పరా …… , స్వయంవరానికి ఇప్పటికే ఆలస్యం అయ్యింది .
చెబితే నాకేంటి ? .
అంతే చుట్టూ కత్తులను నావైపుకు ఎక్కుపెట్టారు .
నన్ను చంపేస్తే మీకు తోవ ఎవరు చెబుతారు యువరాజా ……. , ఇటువైపుగా ఒక్క మనిషీ రాడు .
యువరాజు : ఆ రాజ్యపు అతిలోకసుందరి కోసం తప్పదు – ఏమికావాలో కోరుకో అంటూ ముందుకువచ్చాడు .
ఏమీలేదు యువరాజా ……. , ఇంతకుముందు వెళ్లిన యువరాజులానే తమరుకూడా నాకు కౌగిలింత ఇవ్వాలి , ఇద్దరు యువరాజులను కౌగిలించుకున్నానని జీవితాంతం చెప్పుకుంటాను .
యువరాజు : నీలాంటివాడితో ఇలా మాట్లాడటమే గొప్ప – వీడని చిత్రహింసలు పెట్టి శిక్షించయినా మార్గం తెలుసుకోండి .
ప్రాణం తీసినా చెప్పను యువరాజా ……. , ఇక మీఇష్టం ఎలాగైనా శిక్షించుకోండి అంటూ దైర్యంగా చేతులను విశాలంగా చాపాను .
సైన్యాధ్యక్షుడు : యువరాజా …… సమయం పరిగెడుతోంది – మీకోరిక తీరాలంటే ఇదొక్కటే మార్గంలా ఉంది .
అవునవును ఇదొక్కటే మార్గం చిన్న కౌగిలింత , నేనేమీ ఆభరణాలు అడగలేదు .
యువరాజు : సరే మనదు వాడిని తనిఖీ చెయ్యండి .
బాటసారిని చూసే ఇంత భయపడితే ఎలా యువరాజా …… , రండి పూర్తిగా తనిఖీ చేసుకోండి , సమయం లేదు ……
సైనికులు వచ్చి వొళ్ళంతా తడిమి ఏమీలేదు యువరాజా ……
అయినాకూడా భయపడుతూనే నన్ను కౌగిలించుకున్నాడు .
చటుక్కున ఉంగరాన్ని కొట్టేసి చాలు యువరాజా చాలు ……. , యువరాజాఈ రాజ్యం పేరు చెప్పనేలేదు , అదిగో మళ్లీ ఆలస్యం చేస్తున్నారు …….
యువరాజు : దక్షణ భారతదేశంలోనే అత్యంత ధనిక సామ్రాజ్యం ” హిడుంభి రాజ్యం ” ……. అంటూ గర్వపడుతూ చెప్పాడు .
హిడుంభి హిడుంభి ……. అంటూ కేకలువేశారు సైనికులు ……
హిడుంబిల్లానే ఉన్నారు అంటూ మనసులో అనుకుని నవ్వుకున్నాను . యువరాజా ……. మీరు వెళ్లాల్సిన రాజ్యం ఉత్తరం వైపు ఉంది ఈదారిన మీరువెళ్లడం అసాధ్యం కాబట్టి , అరణ్యంలో ఇటువైపు అంటే పడమరవైపుగా కొద్దిదూరం వెళితే రహదారి కనిపిస్తుంది ఆ దారిలో తూర్పువైపుగా 10 క్రోసులు వెళితే చంద్ర రాజ్యం చేరిపోతారు .
యువరాజు : స్వయంవరం సమయానికి చేరుకోగలమా ? .
ఎంతమాట యువరాజా …… రెండు గడియల్లో చేరిపోరూ ……
యువరాజు : సైన్యాధ్యక్షా ……. వీడిని బంధించండి , వీడే మనకు మార్గం చూయిస్తాడు .
అలాచేస్తే మీకే చేటు యువరాజా …… , మళ్లీ మీరు ఈ మార్గం ద్వారా సురక్షితంగా వెళ్ళాలా లేదా …… ? , ఇలా కొండచరియలు విరిగిపడ్డాయని దగ్గరలోని మా రాజ్యపు ప్రభవుకు విన్నవిస్తేనేకదా మార్గాన్ని పునరుద్ధరించేది , మీరు నన్ను బంధిస్తారన్నా కూడా మీకోక సహాయం చేస్తాను , ఈల వెయ్యగానే మంజరి వచ్చి నా చేతిపై వాలింది – చిలుకా …… వీరిని చంద్ర రాజ్యానికి సురక్షితంగా చేర్చు జాగ్రత్త – యువరాజా చిలుక వెళ్లిపోతోంది తొందరగా వెళ్ళండి అంతటి విశ్వ సుందరిని పొందాలంటే ఈమాత్రం కష్టపడాల్సిందే ……. ( నేను చేస్తున్నది కూడా అదే అంటూ నవ్వుకున్నాను ) .
సైన్యాధ్యక్షుడు : యువరాజా …… చిలుక వెళ్లిపోతోంది , వాడిని వదిలెయ్యండి మనం గమ్యం చేరడం ముఖ్యం అంటూ బయలుదేరారు .
మంజరీ జాగ్రత్త అంటూ మనసులో తలుచుకుని , మిత్రమా …… రాజ్యపు గుర్తింపు – రాజ ముద్రిక దొరికింది , ఇక మనల్ని స్వయంవరానికి హాజరు కానివ్వకుండా ఎవ్వరూ ఆపలేరు , అతిలోకసుందరి నా మహీ …… వచ్చేస్తున్నాను అంటూ సామంతరాజ్యం చేరుకున్నాను .
ముందుగా నదీఅమ్మ ప్రవాహంలో స్నానమాచరించి , మహి ఇచ్చినవాటితో మొదట మిత్రుడికి రాజసం ఉట్టిపడేలా అలంకరించి అద్భుతం అంటూ ముద్దుపెట్టాను .
యువరాజు వస్త్రాలను – కంకణ ఆభరణాలను – యువరాజు తలపాగాను – ఖడ్గాన్ని ……. ఇతరత్రా అన్నింటినీ ధరించి ప్రావాహంలో నా ప్రతిబింబాన్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను , నా ముద్దుల మహికి శతకోటి ముద్దులు అంటూ మురిసిపోయాను .
నదీఅమ్మా …… క్షత్రియ దర్పం కనిపిస్తోందా ? .
అవునన్నట్లు ఒక అల నా ఎత్తువరకూ ఎగసింది .
మాఅమ్మకు నేనంటే చాలా ఇష్టం – అమ్మా …… అమ్మవారిని కూడా దర్శించుకుని మీ ఇద్దరి ఆశీర్వాదం మరియు గురువుగారి ఆశీస్సులతో మీ బిడ్డను జయించడానికి వెళుతున్నాను అంటూ నా విల్లును కూడా అందుకుని దేవాలయంవైపుకు నడిచాను .
దారిపొడుగునా యువరాజు యువరాజు అంటూ దండాలుపెడుతుండటం చూసి మురిసిపోయాను .
దేవాలయంలోనికి వెళ్లి అమ్మా …… మీ ఆశీస్సులతో హిడుంభి రాజ్యపు యువరాజులా స్వయంవరానికి వెళుతున్నాను – ఏ ఆటంకాలూ కలగకుండా దీవించు తల్లీ ……..
దీవించినట్లు అమ్మ చేతిలోని పువ్వు అమ్మ పాదాల చెంతకు చేరింది .
ధన్యుణ్ణి తల్లీ ధన్యుణ్ణి ……. , మీ భక్తురాలికి అందిస్తాను అంటూ పువ్వుని మరియు అమ్మవారి కుంకుమను తీసుకుని , షాష్టాంగ నమస్కారం చేసి బయటకువచ్చాను .
మిత్రమా …… అమ్మవారి ఆశీర్వాదం లభించింది బయలుదేరుదాము – ఈపాటికి మంజరి రావాల్సిందే ……
వచ్చేసాను ప్రభూ అంటూ భుజంపైకి చేరింది – నేనురాకుండా మీరు కదలరని నాకు తెలియదా చెప్పండి .
మంజరీ …… ఆ హిడుంబులను ఎక్కడకు చేర్చావు ? .
మంజరి : దట్టమైన కీకారణ్యంవైపుకు సాగనంపాను ప్రభూ ……. , బయటపడటానికి ఒక రోజైనా పడుతుంది , వారు దారిన పడేసరికి చీకటిపడిపోతుంది – స్వయంవరం పూర్తయిపోయి ఉంటుందని తెలుసుకుని వెనుతిరిగివెళ్లిపోతారు – ఆ హిడంభి గాడికి మన అందాలరాశి కావాలట అంటూ నవ్వుకున్నాము , ప్రభూ …… అక్కడ మన యువరాణి ఎదురుచూస్తూ ఉంటుంది .
అవునవును అంటూ ముద్దుపెట్టి , మిత్రుడిపైకి ఎక్కాను – మిత్రమా …… అటువైపు కాదు ఇటువైపు అని చెబుతున్నా పట్టించుకోకుండా సామంతరాజ్యం సంతలోకి తీసుకెళ్లి ఒక దుకాణం దగ్గర ఆగాడు .
మీసాలు గడ్డాలు మారువేషాల దుకాణం దగ్గర ఎందుకు ఆగావు మిత్రమా …… ఆ…..ల…..స్యం …… అవుతూ …… , సరే సరే ఇప్పటికి అర్థమయ్యింది , మన గురుకుల రాజ్యపు యువరాజులు కూడా వచ్చే ఉంటారుకదూ …… మనం మారువేషాలలో వెళ్ళాలి లేకపోతే పసిగట్టేసి మనసంగతి అందరిముందూ బయటపెడతారు …… , సరైన సమయానికి గుర్తుచేసావు అంటూ ముద్దుపెట్టి కిందకుదిగాను .
పెద్ద మీసాలు – గడ్డం తీసుకుని ఒక విలువైన ఆభరణం ఇచ్చాను .
మహాప్రసాదం ప్రభూ అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు .
వెంటనే అక్కడినుండి నా దేవకన్య రాజ్యానికి బయలుదేరాము – దారిలో చెట్లనుండి పళ్ళు కోసుకుని ముగ్గురమూ తింటూ చంద్ర రాజ్యం చేరుకున్నాము .
స్వయంవర ఏర్పాట్లతో రాజ్యం మొత్తం కోలాహలంగా ఉంది – యువరాజులకు ఘనమైన స్వాగత కార్యక్రమాలు వీధులలో జరుగుతున్నాయి – కోలాటం కచేరీలు లాంటివి …….
ఇక మారువేషంలో తిరగాల్సిన సమయం అంటూ పెట్టుడు మీసాలు – గడ్డాన్ని ఉంచుకుని , మిత్రమా – మంజరీ …… గుర్తుపట్టగలరా ? అని అడిగాను .
మంజరి : ప్రభూ …… పూర్తిగా మారిపోయారు – మహి తప్ప ఎవరూ గుర్తుపట్టనేలేరు .
మహి గుర్తుపడుతుంది అంటావా మంజరీ …….
మంజరి : మీరే తన సర్వస్వం ప్రభూ ……. , కావాలంటే నేనువెళ్లి మహికి మీరు రాలేకపోతున్నారని అపద్ధం చెబుతాను , నమ్మనే నమ్మదు నాకుకూడా తెలుసు , ఒకసారి ప్రయత్నించి చూద్దాము .
ఈపాటికే నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది మహి – నువ్వువెళ్లు మంజరీ ……
మంజరి : మహితోకంటే మీతో ఉండటమే సంతోషం ప్రభూ …….
చాలా సంతోషం మంజరీ …… అంటూ సున్నితంగా అందుకుని ముద్దుపెట్టాను .
మంజరి : మీరు ఆజ్ఞ వేశారు కాబట్టి వెళతాను ప్రభూ …… , గంభీరంగా – ఠీవిగా లోపలికి వచ్చెయ్యండి , మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము అంటూ ఎగురుకుంటూ వెళ్ళింది .
మంజరి చెప్పినట్లుగా ఎవ్వరికీ అనుమానం కలగకుండా నిటారుగా కూర్చుని వీధులలోని ఏర్పాట్లను తిలకిస్తూ , సైనికుల పాహారాలో వెళుతున్న యువరాజుల వెనుకే రాజ్యపు మహాద్వారాన్ని చేరుకున్నాను .
అక్కడి పిలుపులను బట్టి బయట రాజ్య సైన్యాధ్యక్షుడు మరియు మంత్రిగారు – ద్వారంలోపల ఏకంగా ప్రభువుల వారే యువరాజులను రాచమర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు .
అందరూ అయిపోవడంతో చివరన కాస్త భింకంతోనే మహాద్వారం దగ్గరికి వెళ్ళాను.
సైన్యాధ్యక్షుడు : మంత్రిగారూ …… , హిడుంభి రాజ్యపు యువరాజు రానే వచ్చారు – ఒంటరిగా వచ్చారు – వీరి దగ్గర రాజముద్ర కూడా ఉంది .
మంత్రిగారు : యువరాజా …… మిమ్మల్ని ఆపినందుకు క్షమాపణలు – మా సామ్రాజ్యపటంలో మీ రాజ్యం ఎక్కడ ఉందో తెలియరాలేదు .
ఇలాకాదు నటనను ఎక్కుపెట్టాల్సిందే , స్వయంవరానికి ఆహ్వానించి ఇలా అవమానిస్తారా ? , దక్షిణ భారతదేశంలోనే అత్యంత ధనిక రాజ్య యువరాజునే ఆపుతారా ఎంత ఎంత ……. ధైర్యం ……
మంత్రిగారు : యువరాజా యువరాజా …… శాంతించండి శాంతించండి , ఒంటరిగా వచ్చినందువలన అనుమానించాల్సి వచ్చింది .
అందరి యువరాజుల్లా సైనికుల రక్షణతో రావాల్సిన అవసరం నాకులేదు – నేనే వారికి రక్ష ……..
మంత్రిగారు : యువరాజా …… ప్రభువుల చెంతకు తీసుకునివెళతాను రండి .
ప్రభువు : మంత్రిగారూ …… ఏమి జరిగింది ? .
మంత్రిగారు : ప్రభూ …… హిడుంభి రాజ్యపు యువరాజు , రాజ ముద్రిక కూడా ఉంది ప్రభూ …….
ప్రభువు : రాజముద్రిక ఉంటే రాజ్యం ఉన్నట్లే ……. , స్వయంవర సమయం ఆసన్నమయ్యింది , యువరాజులను వేచి ఉండేలా చెయ్యడం భావ్యం కాదు , హిడుంభి యువరాజా …… వీరుచేసిన అపరాధానికి నేను క్షమాపణలు చెబుతున్నాను , మీకు చంద్ర రాజ్యం తరుపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము రండి స్వయంవర పోటీలకు మేమే స్వయంగా పిలుచుకునివెళతాము .
మిత్రుడిని …… సైనికులు తీసుకెళ్లారు .
మిత్రమా …….
ప్రభువు : యువరాజా …… మీ అశ్వానికి ఏలోటూ లేకుండా చూసుకుంటారు .
సంతోషం మహాప్రభూ ……. , మీ రాజ్యం గొప్పతనం – మీ రాకుమారి అందచందాలు విని ఉత్సాహంతో వచ్చాము .
ప్రభువు : మహా సంతోషం యువరాజా …… , ముందు మా ఆతిధ్యం స్వీకరించండి అంటూ ఘనంగా ఏర్పాటుచేసిన విందుకు తీసుకెళ్లారు , అప్పటికే యువరాజులంతా ఫలహారాలు స్వీకరిస్తున్నారు .
రాజ మందిరాలు అంటే ఇంత మహాద్భుతంగా ఉంటాయా ఎటుచూసినా అత్యద్భుతమైన అలంకరణలు అంటూ పెదాలపై చిరునవ్వుతో చుట్టూ చూస్తున్నాను – చినప్పటినుండీ ఈ ప్రదేశమంతా తిరుగుతూ ఆడుకుంటూ పెరిగి ఉంటుంది నా దేవకన్య అంటూ ఆనందిస్తున్నాను .
ఎదురుగా విందు స్వీకరిస్తున్న మా గురుకులానికి మూడువైపులా గల రాజ్యాల రాజకుమారులు – వెంటనే స్థంభం వెనుక దాక్కున్నాను , రేయ్ …… ఇప్పుడు నువ్వు గురుకుల మహేష్ కాదు యువరాజు మహేష్ – మారువేషంలోనూ ఉన్నావుకదా ఇంకెందుకు భయం , ఒకసారి వాళ్ళ దగ్గరకే వెళ్లి ప్రయత్నిద్దాము అంటూ పండు అందుకుని తింటూ దగ్గరికివెళ్ళాను .
ప్రతీ యువరాజు …… వాళ్ళ వాళ్ళ సైన్యాధ్యక్షులతో ఎలాగైనా స్వయంవరం గెలవాలి – అతిలోకసుందరిని చేబట్టాలి అంటూ పట్టపగలే కలలు కంటుండటం విని నవ్వు వస్తోంది , అందులో మా రాజకుమారులేమీ తీసిపోలేదు .
రాజకుమారులు : గురుకులంలో ఎలాగో మన ప్రభావాన్ని చూయించలేకపోయాము – ఎలాగైనా ఈ విశ్వసుందరిని మనలో ఎవరో ఒకరం గెలుచుకోవాలి , ఆ మహేష్ తప్ప మనతో సమానమైన వీరుడు ఎవ్వడూ ఉండడు – గురువుగారు కష్టపెట్టినా యుద్ధవిద్యల్లో నైపుణ్యాన్ని నేర్పించారు .
మా రాజకుమారులు నిద్రలోనూ నా గురించే ఆలోచిస్తారు అన్నమాట – గురువుగారూ …… మీకు పాదాభివందనం .
అంతలో ప్రభువు మాటలు వినిపించాయి …….
రాజకుమారులారా ……. నా ఆహ్వానాన్ని మన్నించి ఇంతదూరం స్వయమవరానికి విచ్చేసినందుకు చంద్ర సామ్రాజ్యం తరుపున స్వాగతం సుస్వాగతం ……. , మా స్వాగతం – ఆతిధ్యం నచ్చిందనుకుంటాను …….
అందరూ సంతోషంతో కేకలువేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు .
ప్రభువు : కృతజ్ఞుణ్ణి , ఈ స్వయంవరం కేవలం యువరాణీ కోసం మాత్రమే కాదు యువరాణిని గెలుపొందినవారు నా తదుపరి ఈ రాజ్యాన్ని కూడా చేజిక్కించుకోబోతున్నారు .
సంతోషపు కేకలు ఎల్లలు దాటుతున్నాయి .
ప్రభువు : సంతోషం సంతోషం …… , మీరు ఇక్కడ ఉన్నంతసేపూ మీ సేవలో తరిస్తాము , మీ సంతోషమే మా సంతోషం , స్వయంవరం అన్నది మన క్షత్రియ ఆచారాలలో ఒకటి కాబట్టి గెలుపోటములను ఆనందంతో స్వీకరించాలని కోరుచున్నాను , స్వయంవరం తరువాత కూడా మీరు మాకు ఆత్మీయులే ఎన్నిరోజులైనా మీసేవలో పునీతం అవుతాము .
చాలా బాగా చెప్పారు ప్రభూ ……. , మీ ఆతిధ్యం ఇప్పుడు మీ మాటలు …… మమ్మల్ని చాలా సంతోషపెట్టాయి .
ప్రభువు : చాలా సంతోషం యువరాజా …… , ప్రక్కనున్న క్రీడా మైదానంలో కాసేపట్లో స్వయంవర పోటీలు జరపబడుతాయి – పోటీలుకాదు ఒకేఒక పోటీ , అందరూ హాజరుకావాల్సినదిగా మనవి …….. , ఒకరు గొప్ప ఒకరు చిన్న అని మాకు తేడాలు లేవు – తమరు వచ్చిన సమయాన్ని బట్టి ఒక్కొక్కరినీ పోటీలో పాల్గొనే అవకాశం ఇస్తాము , చివరన వచ్చిన యువరాజుకు చివరగా అవకాశం …….
ఒకవైపు వరుసగా ద్వారాలు తెరుచుకున్నాయి – బయటకు వెళ్ళిచూస్తే చిన్న క్రీడా మైదానం చుట్టూ యువరాజులు తమ వంతు వచ్చేన్తవరకూ విలాసవంతంగా కూర్చువడానికి అన్నీ ఏర్పాట్లూ చేశారు , ఎదురుగా కాస్త ఎత్తులో ప్రభువు వచ్చి కూర్చుని అందరినీ ఆశీనులు కమ్మని ఆహ్వానించారు – ప్రక్కనే పరదా వెనుక నా దేవకన్య ఉన్నదని నా మనసుకు తెలిసిపోయి అటువైపే ప్రేమతో చూస్తున్నాను .
ఆశ్చర్యం ……. మారువేషంలో ఉన్న నన్ను కనిపెట్టేసినట్లు పరదా చాటునవచ్చి గాలిలో ముద్దు విసరడం చూసి తెగ ఆనందపడిపోతున్నాను .
పోటీ ప్రారంభం అన్నట్లు చుట్టూ శబ్దాలు వినిపిస్తున్నాయి – యువరాజులందరూ వెళ్లి విలాసవంతమైన సింహాసనాల్లో కూర్చుంటున్నారు .
నా అదృష్టం నా దేవకన్యకు ఎదురుగా ఉన్న సింహాసనం ఖాళీగా ఉండటంతో వెళ్లి కూర్చుని అటువైపే చూస్తున్నాను , అంతటి రాజ్యపు శబ్దాలు మరియు చుట్టూ కోలాహలం మధ్యన కూడా నా దేవకన్య నవ్వులు నా మనసుకు తెలిసి హృదయంపై చేతినివేసుకుని అనుభూతి చెందుతున్నాను – అదిచూసినట్లు నవ్వుల ఘాడత అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
అంతలో పది పదిహేను మంది దిట్టమైన సైనికులు చక్రాల బండిని అతికష్టంగా ఒకవైపు లాగుతూ మరొకవైపు తోసుకుంటూ వచ్చి , క్రీడా మైదానం మధ్యలో ఏర్పాటుచేసిన నీటి అలంకరణ ప్రక్కనే ఉంచి నీరసంగా వెళ్లిపోయారు .
ఏంటి ప్రభూ ……. ఇంత చిన్న బండిని ఇంతమంది సైనికులు లాక్కొచ్చారు అంటే మీ రాజ్యంలో సైనికులు ఇంత బలహీనమా అంటూ యువరాజులంతా నవ్వుకుంటున్నారు .
నాకైతే అలా అనిపించలేదు – ఉత్కంఠతో చూస్తున్నాను .
ప్రభువు : రాజకుమారులు అలా మాట్లాడటంలో తప్పులేదు , రాజకుమారులు ఎంతటి వీరులో ఈ పోటీతో తెలిసిపోతుంది అంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చి అందరి నోళ్ళూ మూయించారు . మహామంత్రీ …….
మహామంత్రీ : చిత్తం ప్రభూ అంటూ ప్రక్కనే కూర్చున్నవారు లేచి ముందువచ్చారు – రాజకుమారులారా ……. చూసేదంతా అపద్ధము కాదు , అక్కడ మీరు బండిని చూస్తున్నారు కానీ దానిపైనున్న ధనుస్సును చూడటం లేదు , రామాయణంలో సీతా స్వయంవరంలో ఆ రాముడు విరిచిన ధనస్సుతో ఈ ధనస్సు ఏమాత్రం తక్కువకాదు – ఇక ఆలోచించుకోండి , నిజం చెబుతున్నాను మా యువరాణీ మాత్రం సీతనే తనను పొందే రాముడు మీలోనే ఉన్నాడని భావిస్తున్నాము .
నా దేవకన్య సీతా సమానమైనదన్నమాట అంటూ నా దేవకన్యవైపు మరింత ప్రాణంలా చూస్తున్నాను – అందమైన నవ్వులు వినిపించి పులకించిపోతున్నాను .
మహామంత్రి : మా రాజ్యం తరతరాలుగా ఈ ధనుస్సు మాతోనే ఉండిపోయింది – ఎక్కడ నుండి ఎలావచ్చిందో ఎవ్వరికీ తెలియదు – చరిత్ర ప్రకారం మాత్రం దేవలోకం నుండి వర్షపు రూపంలో భువిపైకి చేరి మా నదీ ప్రవాహంలో మా రాజ్యాన్ని చేరిందని – అప్పట్లో బాహుబలుల్లాంటి పాతికమంది పైనే సైనికులు అప్పటి మా ప్రభువు గారితోపాటు దీక్ష చేబట్టి హోమాలు జరిపించి ఒడ్డు నుండి రాజ్యంలోకి చేర్చారు – సమస్య ఏమిటంటే ధనస్సు విల్లులు ఉన్నాయికానీ ఎక్కుపెట్టే తాడు ఎక్కడ ఉందో ఇప్పటివరకూ ఏ ప్రభువులూ తెలుసుకోలేకపోయారు – మీరూ వెళ్లి చూడవచ్చు ……………..
యువరాజులతోపాటు వెళ్లి చూసాను – ఆశ్చర్యం అద్భుతం …….
మహామంత్రి : మరి సీతలాంటి సుగుణాలరాశి అయిన మా యువరాణిని మరియు మా రాజ్యాన్ని పొందే వీరుడు …… ఆ ధనస్సుని ఎత్తి విల్లు ఎక్కుపెట్టి పైన తిరుగుతున్న బంగారు చేపలను కొట్టగలగాలి – ఇదే స్వయంవర పోటీ …….
అదేంతపని మహామంత్రీ ……. వరుసప్రకారం పిలవండి , మా తరువాత యువరాజులకు కష్టం లేకుండా ఇంటికి సాగణంపై యువరాణిని – రాజ్యాన్ని మాసొంతం చేసుకుంటాము అంటూ ఉత్సాహం చూపుతున్నారు .
మహామంత్రి : రాకుమారులారా నెమ్మది నెమ్మది , పోటీకి ఈ ఉత్సాహమే కావాల్సినది , తమ తమ సింహాసనాల్లో ఆశీనులు కండి – మహారాజా …….
ప్రభువు : పోటీ మొదలెట్టండి …….
రాజ్యం నలువైపులా దండోరా మారుమ్రోగిపోతోంద .