ఖర్కోటఖుడు – Part 11

Posted on

హార్ధిక్ రిచర్డ్స్ మనసును చదివినట్టు “ప్రాణాలు చివరి దశకు వచ్చేసాక ఇంత దీర్ఘాలోచన పనికిరాదు రిచర్డ్స్.. డీల్ ఆర్ నో డీల్. తొందరగా చెప్పు” అన్నాడు.

“హ్మ్మ్.. ఓకే. నాకు ఒక ఫోన్ కావాలి” అన్నాడు రిచర్డ్స్ సంధికి సిద్ధపడ్డట్టు.

హార్ధిక్ చిటికె వెయ్యగానే హార్ధిక్ మనిషి ఒకడు రిచర్డ్స్ చేతికి ఫోన్ అందించాడు. రిచర్డ్స్ చకచకా నెంబర్ డయల్ చేసి తన మనిషికి ఏం చేయాలో చెప్పాడు.

“వస్తున్నారు” అన్నాడు ఫోన్ హార్ధిక్ మనిషికి అందించి తలెత్తి చూస్తూ.

హార్ధిక్ సూట్ బటన్స్ సరిచేసుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు. పక్కన టూటూ హార్ధిక్ కి గొడుగు పట్టాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.

రిచర్డ్స్ కొంచెం కొంచెం రక్తం కోల్పోతూ ఆ ఎండ వేడికి అప్పుడో ఇప్పుడో అన్నట్టు ఉన్నాడు అలాగే నేల మీద.

రిచర్డ్స్ అరగంట నరకం అనుభవించాక ఒక తెల్లటి వాన్, అందులోనుంచి నలుగురు రిచర్డ్స్ మనుషులు చేతులు కట్టేసిన సౌరవ్ ఠాగూర్ ని తీసుకుని దిగారు.

హార్ధిక్ ఎప్పుడూ తన తండ్రిని అంత దైన్యంగా చూడలేదు. ముందు రిచర్డ్స్ మీద కోపం వచ్చినా తను చేసినదాంతో పోలిస్తే ఇది అసలు లెక్కే కాదని తమాయించుకున్నాడు.

రిచర్డ్స్ మనుషులు సౌరవ్ ని అప్పగించి తన దగ్గరకు వస్తుంటే వాళ్లనే చూస్తున్నాడు. వాళ్ళ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతకు మించి తల ఎత్తడం తన వల్ల కావట్లేదు. వాళ్ళు చేరువగా వస్తున్న కొద్దీ కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. చివరిగా ఒక నలుపురంగు బూటుని చూస్తూ స్పృహ కోల్పోయాడు.

మూడు రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఇదిగో ఇలా ఉన్నాడు.

పగ, ప్రతీకారం, అవమానం, భాధ, ఆవేశం ఇలాంటి రకరకాల భావాలతో రిచర్డ్స్ వొళ్ళు దహించుకుపోతుంది.

మెల్లిగా అతనికి తెలియకుండానే అతని కట్లన్నీ రక్తసిక్తంగా మారిపోయాయి. అది గమనించిన రిచర్డ్స్ అసిస్టెంట్ భయంతో “డాక్టా…ర్” అంటూ అంటూ గావుకేక పెట్టాడు.

హుటాహుటిన గదిలోకి వచ్చేసారు నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు, పదిమంది నర్సులు, ఎంపీ రమానాథ్, రిచర్డ్స్ ముఖ్య అనుచరులు.

రిచర్డ్స్ ని వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి స్ట్రెస్ రిలీజ్ చెయ్యడానికి ఇంజక్షన్ ఇచ్చారు. కొద్దిగా తగ్గింది రిచర్డ్స్ కి.

రిచర్డ్స్ బీపీ చెక్ చేస్తూ నార్మల్ అయ్యిందని నిర్ధారించుకున్నాక వాళ్లలో ఒక డాక్టర్ ” మిస్టర్ రిచర్డ్స్ మీకు తెలుసుకదా మీకు బాగా గాయాలయ్యాయని? ఇలా అయితే మీ ప్రాణానికే ముప్పు. ఒక నెల రోజులు గాయాలు మానేవరకు మీరు దేనికీ రియాక్ట్ అవ్వకూడదు. దయచేసి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండండి” అన్నాడు.

“నో డాక్టర్ నో.. నేను అలా ఉంటే అంతా అయిపోతుంది. నేను ఓడిపోతాను. నా జీవితాశయం నెరవేరదు. ఒక పిల్ల కాకి చేతిలో నేను ఓడిపోతాను. ఎంత డబ్బు ఖర్చైనా నాకు లెక్కలేదు. నేను వెంటనే లేవాలి. స్పెషలిస్ట్స్ ని పిలిపించండి. ప్లీస్ డాక్టర్ ప్లీజ్.” ఏం చెప్తున్నాడో ఎలా చెప్తున్నాడో తెలియట్లేదు రిచర్డ్స్. ఊగిపోతున్నాడు.

వెంటనే బీపీ పెరిగిపోవడంతో డాక్టర్ ఇంకొక సూది వెయ్యాల్సివచ్చింది. “సీ మిస్టర్ రిచర్డ్స్. మీ కోసం రమానాథ్ గారు దగ్గరుండి ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ ని మీ కోసం నియమించారు. మీకు అంతగా తగ్గదు అనుకుంటే మీరు మీ దేశం వెళ్లి బాగుచేయించుకురండి. మాకు నష్టం లేదు. ఇండియాలో డబ్బుకు కొదువేమో కానీ ప్రతిభకు కాదు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది. ఇంకొక్కసారి బీపీ పెరిగితే మీ ప్రాణాలకే ప్రమాదం. తర్వాత మీ ఇష్టం. రమానాథ్ మీరు అర్థమయ్యేలా చెప్పండి. ” అంటూ విసురుగా బయటకు నడిచాడు ఆ డాక్టర్. వెనకాలే మిగిలిన డాక్టర్లు.

“రిచర్డ్స్ ప్లీజ్…” అన్నాడు రమానాథ్ రిచర్డ్స్ భుజం మీద చెయ్యి వేసి.

“అవును.. కానీ ఆలోచిస్తా.. ప్రశాంతంగా.. మరింత ప్రశాంతంగా.. నన్ను కొంతసేపు వదిలెయ్యండి. నేను పిలిచే వరకు ఎవరూ లోపలికి రావొద్దు. డోర్ లాక్ చేసి వెళ్లిపో” అంటూ బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకున్నాడు రిచర్డ్స్ ఆలోచనల నిధి వైపు దారి తీస్తూ….

171170cookie-checkఖర్కోటఖుడు – Part 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *